హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఒకే ఎన్నిక నిర్వహించకుండా రెండు ఎన్నికలు నిర్వహించడంలో ఆంతర్యమేమిటని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బో యినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరి స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వడం ఎందుకని ఒక ప్రకటనలో నిలదీశారు.
గతంలో 2021 నవంబర్ 9న ఒకే నోటిఫికేషన్ ద్వారా నిర్వహించిన ఎన్నికల్లో కడియం శ్రీహరి, కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ లీగల్ సెల్‌తో చర్చించి ఎన్నికల అధికారులకు లేఖ రాయనున్నట్టు తెలిపారు. కాం గ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఈసీ కుయుక్తి పన్నిట్టు అర్థమవుతున్నదని ఆరోపించారు.