హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): గౌడన్నల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని నీరా కేఫ్‌ను కల్లుగీత కార్మికులకే అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. నీరాకేఫ్ అన్యాక్రాంతాన్ని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో కల్లుగీత కార్మికులు, గౌడ సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు తెలియజేశారు. నీరాకేఫ్ వద్ద ఎక్సైజ్, టూరిజంశాఖ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గౌడ సంఘాలు ఉద్యమం చేశాయి.
అన్ని జిల్లాల్లో కల్లుగీత కార్మికులు, గౌడ సంఘాల నేతలు పలురూపాల్లో నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 17న హైదరాబాద్‌లో మహాధర్నా, అసెంబ్లీ ముట్టడికి 63 గౌడ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో తలొగ్గిన ప్రభుత్వం నీరాకేఫ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోమని, త్వరలోనే కల్లుగీత కార్పొరేషన్‌కు ఇస్తామంటూ సర్క్యులర్ విడుదల చేసింది. అయినా ప్రభుత్వం నుంచి జీవో, అధికారిక ప్రకటన వస్తేనే ఆందోళనలు విరమిస్తామని గౌడ సంఘాలు, కల్లుగీత కార్మికులు ప్రకటించడంతో ఉద్యమ కార్యాచరణ మరింత ఉధృతరూపం దాల్చేలా రూపొందించడంతో ప్రభుత్వం దిగొచ్చింది.
ప్రభుత్వం దిగిరావడంతో గౌడ సంఘాల నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, అంబాల నారాయణగౌడ్, యెలికట్టె విజయ్‌కుమార్‌గౌడ్, సాయన్నగౌడ్, శివకుమార్‌గౌడ్, ఏడుకొండలు గౌడ్, చీకటి ప్రభాకర్‌గౌడ్, సదానంద్‌గౌడ్, శ్రీకాంత్ గౌడ్, నక్కా కృష్ణగౌడ్, ముద్దగోని రామ్మెహన్గౌడ్, రమణగౌడ్, బొమ్మగాని ప్రభాకర్‌గౌడ్, జైహింద్‌గౌడ్, బాలకృష్ణగౌడ్, పటేల్ వెంకటేశ్‌గౌడ్, సీపీఐ, సీపీఐ, బీజేపీ, అనుబంధ కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తంచేశారు.
పర్యాటకశాఖ పరిధిలో ఉన్న నీరాకేఫ్‌ను బీసీ సంక్షేమశాఖలోని కల్లు గీత ఫెడరేషన్‌కు బదిలీ చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నీరాకేఫ్ భవనం, దాని పరిధిలో ఉన్న ఆస్తులను కల్లుగీత ఫెడరేషన్‌కు బదిలీ చేస్తూ మంత్రులుగా తాము ఒప్పందాలపై సంతకాలు చేశామని తెలిపారు. కల్లుగీత కార్మికులకు అండగా ఉంటామని, వారిలో ఉన్న ఆందోళనను తొలగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం తీ సుకొచ్చిన నందనం నీరా ప్రాసెసింగ్ యూనిట్ పనులన్నీ పూర్తయ్యాయి. దానిని త్వరలోనే ప్రారంభించాలి. ఎలక్షన్ కోడ్ వల్ల అప్పుడు ఓపెన్ చేయలేకపోయాం. దీనికి అనుబంధంగా ప్రతీ జిల్లాల్లో నీరా కేఫ్‌లు ఏర్పాటు చేయాలి. గౌడన్నల విశేష ప్రయోజనాల కోసం ప్రభు త్వం పనిచేయాలి. తూతూమంత్రంగా ఒప్పందాలు చేస్తే కుదరదు. ఎన్నికల హామీలను అమలు చేయాలి.