Nalgonda | నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ)/నీలగిరి: నల్లగొండ జిల్లాలో క్షేత్రస్థాయి పాలన వ్యవహారాల్లో కీలకమైన గ్రామ, మండల పరిషత్ విభాగం అధికారులు బుధవారం నుంచి సామూహికంగా సెలవుల్లోకి వెళ్లారు. 9 నెలలుగా నిధులు రాకున్నా.. సొంత ఖర్చులతో విధులు నిర్వర్తిస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి ఆయా సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో వేర్వురుగా జాయింట్ కలెక్టర్‌కు సామూహిక సెలవుల వినతిపత్రాలను అందజేశారు.
సమస్యలు పరిష్కరించే వరకు విధులకు వెళ్లబోమని పంచాయతీ కార్యదర్శుల జేఏసీ స్పష్టంచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యేకాధికారుల పాలన మొదలైనప్పటి నుంచి గ్రామపంచాయతీలకు నిధులు రా లేదని, అయినా.. అప్పులు చేసి తాగునీటితోపాటు పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ చేపడుతున్నామని పేర్కొన్నారు. తమకు రావాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశా రు. అకారణంగా సస్పెండ్ చేసిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సామూహిక సెలవుల్లో వెళ్తున్నట్టు అన్ని మండలాల్లో ఎంపీడీవోలకు కార్యదర్శుల జేఏసీ లేఖలను అందజేసింది.
ఇదే స మయంలో ఉన్నతాధికారులు వివిధ రకాలుగా ఒత్తిళ్లకు గురిచేస్తున్నారంటూ మండల పంచాయతీ అధికారులు సామూహిక సెలవు పెట్టారు. ఎంపీడీవో సంఘం ఆధ్వర్వంలోనూ సామూహిక సెలవు కోరుతూ కలెక్టర్‌కు లేఖ పంపించారు. దాంతో జిల్లా వ్యాప్తంగా పాలన ఆగిపోయినట్టు అయ్యింది. అప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం నుంచి కలెక్టర్ నారాయణరెడ్డి మూడు రోజులపాటు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం గమనార్హం. దీంతో సామూహిక సెలవు లు పెట్టిన పంచాయతీ విభాగం అధికారులతో సంప్రదింపులు జరిపేది ఎవరు? పరిష్కారం చూపేది ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.