హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే.. తానూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఇద్దరం కలిసి ఎన్నికలకు వెళ్దామని కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త రాష్ట్ర కమిటీలో 10 నుంచి 12 మంది వరకు సికింద్రాబాద్ పార్లమెంట్‌కు చెందిన వారే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కమిటీలో గ్రామీణ నాయకులకు ఎం దుకు చోటు కల్పించలేదని ప్రశ్నించారు. ఈ కమిటీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రామచందర్‌రావు రబ్బర్ స్టాంప్‌లా మారారని విమర్శించారు. కొత్త కమిటీలో జనరల్ సెక్రటరీగా నియమితులైన అశోక్ తనపై ఇష్టారీతిన మాట్లాడారని, గతంలో ఆయన బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి పార్టీ ఎలా పదవి ఇచ్చిందని మండిపడ్డారు. పార్టీని నాశనం చేస్తున్నది ఎవరో త్వరలో వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.