హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): దీర్ఘకాలంగా హైదరాబాద్లో తిష్టవేసిన ప్రభుత్వ వైద్యులు జిల్లాలకు వెళ్లకుండా ఉండేందుకు మార్గాలను వెతుకుతున్నారు. తాము వెళ్లిపోతే మెడికల్ కళాశాలలకే నష్టమంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది. ‘లాంగ్ స్టాండింగ్ పేరుతో మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తే.. కొత్తగా ఎవరూ రాకపోతే ఎంబీబీఎస్, పీజీ సీట్లు తగ్గిపోతాయి. ఎక్కడో మారుమూల జిల్లాలో మెడికల్ కాలేజీ అనుమతి కోసం హైదరాబాద్లో సీట్లను తగ్గించుకుంటారా’ అంటూ ఉన్నతాధికారులనే దబాయిస్తున్నట్టు తెలిసింది.
గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, చెస్ట్ హాస్పిటల్, సరోజినీదేవి, ఎర్రగడ్డ మానసిక వైద్యశాలల్లో 20 నుంచి 30 ఏండ్లుగా తిష్టవేసినవారు డజన్ల కొద్దీ ఉన్నారని తెలుస్తున్నది. సీనియారిటీ జాబితా ప్రకారం నాగర్కర్నూల్లో పనిచేస్తున్న ఓ హెడ్ నర్సు ఏకంగా 38 ఏండ్లుగా అక్కడే ఉంటున్నారు. హుజూర్నగర్, మిర్యాలగూడలో 30 ఏండ్లకు పైబడి పనిచేస్తున్నవారూ ఉన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, కొత్తగూడెం జిల్లాలో పదుల మంది నర్సులు పాతుకుపోయారు.
నర్సింగ్ విభాగంలోని సీనియారిటీ జాబితాలో తప్పులు దొర్లాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సింగ్ ఆఫీసర్ ఒకే స్టేషన్లో 120 ఏండ్లకు పైగా ఉంటున్నట్టు, మరొకరు 110 ఏండ్లుగా ఉంటున్నట్టు కనిపించడంతో అవాక్కయ్యారట. బదిలీలను ఆపేందుకు సిఫారసు లేఖలతో డీపీహెచ్, డీఎంఈ, టీవీవీపీల చుట్టూ తిరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు.