హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ‘ఈయన మృదుస్వభావి, తెలివైనవాడు. నాకు అత్యంత నమ్మకస్తుడు. నాకు పాలనాపరంగా ఏమైనా అనుమానాలు వస్తే ఈయననే సంప్రదిస్తా’ అని ముఖ్యనేత తరుచూ పొగిడే వ్యక్తి. కానీ ఇప్పుడు అదే ముఖ్యనేత వ్యూహంలో చిక్కి మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఆయన విలవిల్లాడుతున్నారు. మేలిమి పంట కోసం ఆసామి పొలంలో మెండు కొమ్మలను నరికినట్టు.. తన పదవిని కాపాడుకునేందుకు పోటీదారులుగా భావించిన ప్రతి ఒక్కరినీ ముఖ్యనేత పక్కకు తప్పిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు, పార్టీకి అత్యంత నమ్మకస్తుడని ఆయనపై ముద్ర ఉన్నది. రాష్ట్రంలోని సాధారణ కార్యకర్త నుంచి ఢిల్లీ పెద్దల వరకు అందరిదీ ఇదే భావన. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కచ్చితంగా మంత్రి పదవి వరించే అవకాశం ఉన్న మొదటి మూడునాలుగు పేర్లలో ఆయనది కూడా ఒకటి. అనుకున్నట్టే ఆయనకు కీలకమైన, సాంకేతిక అంశాలపై అవగాహన ఉండాల్సిన శాఖలనే కట్టబెట్టారు. ఆ తర్వాత ఎప్పుడూ ముఖ్యనేతతో కలిసి కనిపిస్తుండటం, వీలుచిక్కినప్పుడల్లా ఆ ముఖ్యనేత ఈయనను పొగుడుతుండటంతో అందరూ అంతా బాగుందని అనుకున్నారు.
ఓ దశలో పాలనాపరంగా వెనుక ఉండి అంతా ఆయనే చూసుకుంటున్నారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి పదవిని మార్చుతారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రెండు మూడు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇందులో నంబర్ టూ అని చెప్పుకునేవారు కూడా ఉన్నారు. అయితే వారి శాఖలపై అప్పటికే విచ్చలవిడి అవినీతి ముద్ర ఉండటంతో ప్రత్యామ్నాయ పేర్లు తెరమీదికి వచ్చాయి. ఇందులో ప్రముఖంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఈ నేత పేరు కూడా వినిపించింది. నమ్మకస్తుడు, మృదుస్వభావి, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వం కాబట్టి పదవి ఇస్తే ఎవరూ అడ్డుచెప్పరనే స్థాయిలో ప్రచారం జరిగింది.
తనకు ప్రత్యామ్నాయం అనుకున్న వ్యక్తులందరినీ అసమర్థులుగా ముద్ర వేయిస్తున్నారని ముఖ్యనేతపై రాజకీయ వర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మంత్రిపై అవినీతి ముద్ర వేసేందుకు అవకాశం పెద్దగా లేకపోవడం, ఒకవేళ బలవంతంగా అవినీతి మరకలు అంటించాలని ప్రయత్నిస్తే నమ్మే పరిస్థితి లేకపోవడంతో ముఖ్యనేత రూటు మార్చారని చెప్పుకుంటున్నారు. ఆయనను ఇంటా, బయట కట్టడి చేయాలని నిర్ణయించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో కావాలనో, కాకతాళీయంగానో తెలియదు కానీ ముఖ్యనేతతో సన్నిహితంగా మెలిగే బీజేపీ ఎంపీ ఒకరు కాంగ్రెస్లో ముఖ్యమంత్రి మార్పు జరిగితే సదరు మంత్రికే సీఎంగా అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇంకేముంది ముఖ్యనేతకు అభద్రతాభావం మొదలైంది. నొసటి చిట్లింపులు, పెదవి విరుపులు మొదలయ్యాయి. సదరు మంత్రిని కట్టడి చేయడమే లక్ష్యంగా వ్యూహరచన ప్రారంభమైంది. ముఖ్యనేత తన నమ్మిన బంటుగా ఉన్న ఒక కీలక అధికారిని హెచ్వోడీగా చొప్పించారని, ఆయన నియామకంపై సదరు మంత్రి అభ్యంతరం చెప్పినా వినిపించుకోలేదన్న చర్చ జరుగుతున్నది.
ముఖ్యనేత ఆదేశాలు తప్ప ఎవరి ఆదేశాలనూ తాను పాటించాల్సిన అవసరం లేదని సదరు అధిపతి బహిరంగంగానే చెప్పుకుంటున్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వీరే కాకుండా విజిలెన్స్ అధికారుల నుంచి రోజువారీ ఇసుక వ్యాపారం వివరాలు తెప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ఆ నేత సొంత నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎలాంటి పనులు జరగనీయకుండా ముఖ్యనేత అడ్డుపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. సదరు మంత్రి శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఆయనకు తెల్వకుండా బైపాస్ చేసి తీసుకోవడం ద్వారా డ్యామేజ్ జరిగాక బాధ్యతను ఆయన వైపు నెట్టడం నిత్యకృత్యంగా మారిందట. ఇదంతా ఆయనను బద్నాం చేసే వ్యూహంతోనే సాగుతున్నది.
అటు సొంత నియోజకవర్గంలో పనులుకాక, ఇటు తన పరిధిలోని శాఖల్లో విలువ లేక ఇదేం వ్యవహారమంటూ సదరు నేత అసంతృప్తితో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించేందుకు ముఖ్యనేత దగ్గరికి వెళ్తే, శాఖలు మార్చుదామంటూ ఉచిత సలహాలు ఇస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పెద్దలకు నిధులు సమకూర్చే శాఖను అప్పగిస్తానని చెప్తున్నారట. ఇప్పుడున్న మంత్రిని మార్చేయాలని అధిష్ఠానమే చెప్తున్నదని, కాబట్టి ఆ పదవి తీసుకోవాలని సూచిస్తున్నట్టు తెలిసింది.
దీంతో అలా ఎందుకు చెప్తున్నారో అర్థమై సదరు నేత తీవ్ర ఆలోచనలో పడ్డారని సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మంత్రిపై ఒకప్పుడు అధిష్ఠానం పూర్తి సానుకూలంగా ఉండేదని, ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కూడా జరిగిందని, కానీ ఏడాదిన్నరలో అవినీతి ముద్ర పడేలా చేయడంతో ఏకంగా పదవి నుంచి తొలిగించే స్థాయికి పరపతి పడిపోయిందని సదరు నేత విశ్లేషిస్తున్నారట. అలాంటి పదవిని తనకు ఆఫర్ చేయడమంటే తనను కూడా భ్రష్టుపట్టించే పన్నాగమా? అంటూ ఆయన వాపోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తనకు పోటీగా మారే అవకాశం ఉన్న ఆ నేతకు జిల్లాలో కూడా చెక్ పెట్టాలని ముఖ్య నేత నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగా ఓ వర్గం ఎమ్మెల్యేలకు మంత్రి పదవి అనే అంశాన్ని ముఖ్యనేత తెరమీదికి తీసుకొచ్చారని, వినతులు, మెమోరాండం, విజ్ఞప్తులతో వారిని హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు తిప్పించి అధిష్ఠానం మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు పార్టీ నాయకులే చెప్తున్నారు. ఫలితంగా ఆ నేతకు చెందిన జిల్లాలోనే మరో ఇద్దరికి తాజా ఉన్నత పదవులు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి జిల్లాపరంగా చూస్తే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నవారు నలుగురు ఉన్నారు. సొంత జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఆ నేతను కట్టడి చేయడానికే వరుసగా పదవులు ఇచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.