హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ); రాష్ట్రమంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నమస్తే తెలంగాణ పత్రికను దూషించి, అవమానించడం మీద ప్రజాస్వామికవాదుల నుంచి, సీనియర్ పాత్రికేయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ‘మేం కొట్టుకునేంత కొట్టుకుంటాం.. మీరు మాత్రం రాయవద్దు’ అన్నట్టుగా ఆమె వైఖరి ఉందని వారు అభిప్రాయపడుతున్నరు.
క్యాబినెట్ సమావేశం అంటే రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన సమావేశం. అందులో ఆ విషయం వదిలేసి కాంట్రాక్టుల మీద, ఒకరి శాఖలో మరొకరి జోక్యం మీద కొందరు మంత్రుల అనుచరులకు ఆగమేఘాల మీద కాంట్రాక్టు డబ్బుల చెల్లింపుల మీద గోల గోల జరిగింది వాస్తవం.
అలాగే క్యాబినెట్ సభ్యురాలు కొండా సురేఖ ఇంటి మీదికి పోలీసులు వెళ్లిన విషయం మీద మంత్రులంతా తీవ్రంగా మండిపడింది వాస్తవం. సురేఖకు జరిగిన అవమానం రేపు మా మీద జరగదని గ్యారెంటీ ఏమిటంటూ సహచర మంత్రులు మండిపడింది.. ఆందోళన చెందిందీ వాస్తవం. ఆమెకు ఫోన్లు చేసి సంఘీభావం తెలిపింది వాస్తవం. అంతే కాదు, తమకు తెలియకుండా తమ పీఏలను, పీఎస్‌లను, ఓస్డీలను మార్చవద్దని ఏకంగా సీఎంకే నిష్కర్షగా చెప్పిందీ వాస్తవం. ఈ చర్చనే నమస్తే తెలంగాణ రాసింది.
ప్రభుత్వానికి అమ్ముడుపోయిన పత్రికలు ఈ విషయం ఎలాగూ రాయవు. అయినా ప్రజలకు నిజం తెలియాలన్న లక్ష్యంతో ‘నమసే’్త ఈ విషయాలను పూసగుచ్చినట్టు వెల్లడించింది. ఇదే సీతక్కకు రుచించలేదు.నాలుగుగోడల మధ్య జరిగింది కాబట్టి నలుగురికి తెలియదనేది సీతక్క భావన. అందుకే క్యాబినెట్లో ఏమీ జరగలేదని బుకాయించారు. నమస్తే తెలంగాణ పత్రిక మీద దూషణలకు దిగారు.నిజాలు వెల్లడైనపుడల్లా బుకాయించడం, ఆ తర్వాత నాలుక మడత పెట్టడం సీతక్కకు కొత్తకాదు. టీవీ మైకుల ముందు నోటికి పనిచెప్పడం,ఆ తర్వాత తనంత తానే మీడియాను పిలిచి నేనలా అనలేదని వివరణలు ఇవ్వడం ఆమెకు ఆనవాయితీగా వస్తున్నదనే విషయం ప్రజలందరికీ తెలుసు. గతంలో సమ్మక్క సారక్క గద్దెల నిర్మాణ కాంట్రాక్టు విషయమై పొంగులేటితో వివాదం జరగడం రూ. 71 కోట్ల జాతర కాంట్రాక్టులన్నీ పొంగులేటి అనుచరులకే అప్పగించారని ఏకంగా పీసీసీ అధ్యక్షుడికే ఫిర్యాదు చేయడం అందరికీ తెలుసు.
పీసీసీ అధ్యక్షుడే స్వయంగా కొండా సురేఖతో పాటు సీతక్క కూడా ఫిర్యాదు చేశారని ధ్రువీకరించారు కూడా. తమ ఇంటి సమస్యను తామే పరిష్కరించుకుంటామని కూడా చెప్పారు. అదొక్కటే కాదు, పూర్వ వరంగల్ జిల్లా పరిధిలో పొంగులేటి జోక్యం మీద, సీఎం సన్నిహితుడి పెత్తనం మీద ఇద్దరు మంత్రులు ఎన్నోసార్లు సీఎంకు, పీసీసీ అధ్యక్షుడికి కూడా ఫిర్యాదు చేశారు. బహిరంగంగా ప్రకటనలు కూడా చేశారు. ఇవన్నీ ప్రజలు చర్చించుకుంటున్నవే. ఈ వివాదాలు రోడ్డు మీదికి రావడం మీద సీఎం సీరియస్‌గా స్పందించి వీరి వివాదాల మీద అంతర్గతంగా జరుగుతున్న విషయాల మీద ఢిల్లీకి ఫిర్యాదు పంపడానికి సిద్ధం కాగానే ప్లేటు ఫిరాయించి వివాదం పరిష్కరించాల్సిందిగా పీసీసీ అధ్యక్షుడిని కోరానే తప్ప తానెవరి మీద ఫిర్యాదు చేయలేదని సీతక్కే మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. ఇంతే కాదు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తరలింపు మీద, సమ్మక్క సారక్క గద్దెల కాంట్రాక్టునుంచి, పొంగులేటి వాటాల దాకా అన్నింటిపైనా రచ్చ రచ్చ అయిన విషయం కూడా బహిరంగ రహస్యమే. ఇందులో దాచేందుకు ఏమీ లేదు కూడా. అయినా జరిగిన విషయాలు రాస్తే సీతక్కకు మింగుడు పడడం లేదు. తమకు నచ్చిన రీతిలో ప్రచారం చేసుకోడానికి ఇవి రీల్స్ కావని ఆమె గ్రహించినట్టు లేదు.
మంత్రిగారికి చిత్తశుద్ధి ఉంటే.. క్యాబినెట్ మీటింగ్‌లో ఎలాంటి వివాదాలు రాలేదని, మంత్రి కొండా ఇంటిమీదికి పోలీసులు వెళ్లడానికి సమ్మక్క-సారక్క జాతర కాంట్రాక్టు వివాదం కారణం కాదని ఆ సమ్మక్కసారక్క సాక్షిగా ప్రమాణం చేస్తారా? రూ.71 కోట్ల విలువైన జాతర కాంట్రాక్టు పనులు పొంగులేటి అనుచరులకు కట్టబెట్టడాన్ని సమర్థిస్తున్నానని ప్రమాణం చేస్తారా? ఆదివాసీ ప్రాంత పనులు మైదాన ప్రాంత వాసులకు లభించడాన్ని సమర్థిస్తూ ప్రకటన ఇస్తారా? 1/70 యాక్ట్ అవసరం లేదని ప్రకటిస్తారా?ప్రజలు ఒక విశ్వాసంతో ఇచ్చిన అధికారాన్ని కాంట్రాక్టులు, వాటాల కోసం కాట్లాటలుగా మార్చితే కళ్లు మూసుకోడానికి నమస్తే తెలంగాణ సర్కారుకు అమ్ముడు పోయి సంకలోకెక్కిన రొచ్చు మీడియా కాదు.
తెలంగాణ ఉద్యమ కాలంలో పుట్టి తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కంకణం కట్టుకొని పని చేస్తున్నది.తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ర్టాన్ని, ఆ తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించిన గుంపులోంచి వచ్చిన పిడికెడు మంది రాష్ర్టాన్ని వాటాలు వేసుకొని పప్పుబెల్లాల్లా పంచుకుంటుంటే రాష్ట్ర ప్రగతిని ఈనగాచి నక్కలపాలు చేస్తుంటే.. కలాలు మడిచి మౌనం పాటించదు.ఏం చేసినా ఏమీ రాయకుండా సర్కారు పెద్దల వెనక తోకాడిస్తూ తిరిగే పత్రికలు కొన్ని ఉన్నాయి. వాటికి చెప్పండి మీ బుకాయింపులు.. నీలాపనిందలు! కళ్లకద్దుకొని
అచ్చొత్తుకుంటాయి!!