హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ వర్తింపజేయాలని వయోధిక పాత్రికేయ సంఘం విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు ఆదివారం సంఘం నేతలు కేశవరావు, లక్ష్మణ్‌రావు, ఎన్ శ్రీనివాస్‌రెడ్డి, బండారు శ్రీనివాసరావు, సీ కేశవులు, ఫాజిల్, వేణుగోపాల్‌తో కూడిన బృందం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దేశంలోని 19 రాష్ట్రాల్లో జర్నలిస్టుల పెన్షన్ పథకం అమలులో ఉన్నట్టు గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని సిఫారసు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన భట్టి.. క్యాబినెట్లో చర్చించి అమలుకు కృషిచేస్తామని హామీ ఇచ్చినట్టు సంఘం నాయకులు తెలిపారు.