హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్‌వీఎం కృష్ణారావు (64) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయ న కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో ఉన్న తన ఇంట్లో కన్నుమూశారు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. శుక్రవారం ఉదయం 4.45గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబీకులు తెలిపారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కృష్ణారావు రాజకీయ విశ్లేషకుడిగా వృత్తికి వన్నె తేవడంతోపాటు నిక్కచ్చిగా వ్యవహరించారు. ఆయనను రాజకీయవర్గాల్లో ‘బాబాయ్’గా పిలుస్తారు. చిర్రావురి వెంకట మాణ్యి కృష్ణారావు పచ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1959లో జన్మించారు. 1975లో స్ట్రింగర్‌గా తన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన ప్రతిభతో అనతికాలంలోనే ఉన్నస్థాయికి ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమితోపాటు ఆంగ్ల పత్రికలైన దక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహా పలు తెలుగు దినపత్రికల్లో పనిచేశారు.
కృష్ణారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సేవలను స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజాప్రయోజనాల కోణంలో ఆయన చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచనలు రేకెత్తించేవిగా ఉండేవని తెలిపారు. ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పత్రికా రంగానికి సుదీర్ఘంగా సేవలు అందించారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గౌలిదొడ్డిలోని జర్నలిస్ట్‌కాలనీలో ఉన్న కృష్ణారావు నివాసానికి మంత్రి హరీశ్‌రావు వెళ్లి, పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ కే అశోక్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కృష్ణారావు భౌతికకాయానికి కేవీపీ రామచందర్‌రావు, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, ఏపీ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు.