మహబూబాబాద్ రూరల్, నవంబర్ 21: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో లంచం తీసుకుంటూ సీనియర్ డ్రాఫ్ట్‌మెన్(Senior draftsman) ఏసీబీకి పట్టుబడిన ఘటన గురువారం చోటుచేసుకున్నది. ఏసీబీ(ACB) డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన యువకుడు తాళ్ల కార్తీక్ మహబూబాబాద్ పట్టణ శివారులోని ప్రాంతంలో మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ భూమి సర్వే నంబర్లు, వివాదాలకు సంబంధించిన వివరాల కోసం నక్షకు కలెక్టరేట్లోని సర్వే, భూమి రికార్డుల విభాగంలో గత నెల 28న దరఖాస్తు చేశాడు.
దీనికి సంబంధించి సీనియర్ డ్రాఫ్ట్‌మెన్ జ్యోతీక్షేమాబాయి రూ. 5 వేలతో చలానా తీయాలని చెప్పింది. ఈ క్రమంలో కార్తీక్ ఆమెకు రూ. ఐదు వేలు ఇచ్చాడు. మళ్లీ రెండు రోజుల తరువాత నక్ష మ్యాప్ కోసం బాధితుడు రాగా రూ.20 వేలు ఇస్తేనే మ్యాప్ వస్తుందని జ్యోతీక్షేమాబాయి చెప్పింది. కార్తీక్‌కు లంచం ఇవ్వడం ఇష్టం లేక వరంగల్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 11.30 గంటలకు అతడు జ్యోతీక్షేమాబాయికి రూ. 20 వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఎవరైనా అధికారులు లంచం అడిగితే వెంటనే 1064 నంబరుకు గానీ, ఏసీబీ అధికారులను గానీ సంప్రదించాలని పేర్కొన్నారు.