హద్దు మీరిన ఫోన్ ట్యాపింగ్ అంశం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. ఏకంగా ఢిల్లీ దూత ఫోన్‌నే ట్యాప్ చేశారన్న కథనాల నేపథ్యంలో ఏఐసీసీ తీవ్రంగా స్పందించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తంగా ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి ముఖ్యనేత మెడకు చుట్టుకునేదాకా వచ్చినట్టు గుసగుసలు
వినిపిస్తున్నాయి.
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రయోగించిన ఫోన్ ట్యాపింగ్ అస్త్రం ఎదురుతిరిగిందని, ఆయన పదవికే ముప్పు తెచ్చే పరిస్థితికి తెచ్చిందని చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై త్వరలో అంతర్గత విచారణకు ఆదేశించనున్నట్టు సమాచారం. దీంతో తాను బయటపడటానికి ఉన్న అవకాశాలపై ముఖ్యనేత అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి వచ్చిన అధిష్ఠానం దూత ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన మాటలను దొంగచాటుగా వింటున్నారనే విషయంపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘రాడార్‌లో మేడమ్’ కథనం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు పుట్టించినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల సమాచారం. దీనికితోడు తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, కనీసం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏఐసీసీకి లేఖలు రాసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘మొన్న మా ఫోన్లు ట్యాప్ చేశారు, నిన్న దూత ఫోన్ మీద నిఘా పెట్టారు. రేపు ఢిల్లీ పెద్దల ఫోన్లు కూడా నిఘా రాడార్ పరిధిలోకి వెళ్తాయేమో!’ అంటూ వారు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
రాష్ట్రంలో మేడమ్తోపాటు, అర డజనుమంది మంత్రు లు, 25 మంది ఎమ్మెల్యేల ఫోన్లు రెగ్యులర్ ట్యాపింగ్ మాడ్యూల్‌పై ఉన్నాయని పేర్కొన్నారట. అధిష్ఠానం అనుమతిస్తే తమ వద్ద ఉన్న ఆధారాలతో ఢిల్లీకి వచ్చి అధిష్ఠానానికి సమర్పిస్తామని, లేదా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌కు ఇవ్వటానికి అభ్యంతరం లేదని తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారని, పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా అంతర్గత విచారణకు ఆదేశించాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు సమాచారం.
తెలంగాణతో సంబంధం లేని ఏఐసీసీ సభ్యుడి ద్వారా విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మొన్నటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని కాంగ్రెస్ అడ్డగోలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ కూడా వేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టుండి.. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని, చట్ట బద్ధమేనని, తన ఫోన్ ట్యాప్ కాలేదని ఢిల్లీలో స్వరం మార్చటం అలర్ట్ ప్రకటన లాంటిదేనని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యనేత అప్రమత్తమైనట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ అనుమానాలు ఉన్న మంత్రులను ముఖ్యనేత వ్యక్తిగతంగా పిలిపించుకొని.. బుజ్జగించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యనేత బుజ్జగింపులతో ఇద్దరు మంత్రులు మెత్తబడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో సీనియర్ మంత్రి మాత్రం పార్టీ నేతల మీదే ఎలా నిఘా పెడతారని సీరియస్‌గా ప్రశ్నించారట. మరోవైపు సంబంధిత పోలీసు అధికారులతోనూ చర్చలు జరిపినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ మీద మంత్రులకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించే అవకాశం ఉన్నదో ఆరా తీసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ విచారణ ఎదుర్కోవాల్సి వస్తే.. తాను తప్పించుకునేందుకు ఉన్న మార్గాలపైనా ప్లాన్ వేసినట్టు సమాచారం. తన ప్రమేయం లేకుండానే నిఘా విభాగాలు సదరు మేడమ్, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేశాయని సమాధానం ఇవ్వనున్నట్టు తెలిసింది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఒక అధికారి మీదికి తోసేసే ఎత్తుగడ కనిపిస్తున్నదని పోలీసు వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతన్నది. అదే జరిగితే నిఘా విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారిపై గానీ, ఆ తర్వాత ర్యాంకులో ఉన్న అధికారిపై గానీ వేటు పడే అవకాశం ఉన్నదని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది.