కరీంనగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జగిత్యాల : అనతికాలంలోనే అస లు నైజం బయటపడటంతో ‘వలస కాంగ్రెస్’పై అసలు కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు మొదలైంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన, నాయకత్వంపై పార్టీ సీనియర్లలో భ్రమలు తొలిగిపోతున్నాయి. అణచివేత, అవమానాలు భరించలేక ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లగక్కుతున్నా రు. ప్రధానంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రావడానికి, ముఖ్యమంత్రి కావడానికి ఏ సామాజికవర్గమైతే అండగా నిలిచి సహకరించిందో అదే సామాజికవర్గం ఇప్పుడు ఆయన వ్యవహార శైలిపై రుసరుసలాడుతున్నది.
ఆదినుంచీ కాంగ్రెస్‌కు అండగా నిలుస్తూ వచ్చిన రెడ్డి సామాజికవర్గం సీఎంకు దూరంగా జరిగేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు జగిత్యాలకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఉదంతమే ఉదాహరణగా నిలుస్తున్నది. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, జగ్గారెడ్డి లాంటి వ్యక్తులు పలు సందర్భాల్లో తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, రేవంత్‌రెడ్డి పిలిచి సలహాదారు పదవి కట్టబెట్టిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి సైతం బాహాటంగానే అసహనం ప్రదర్శించడం ఇప్పుడు కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తున్నది.
నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న జీవన్‌రెడ్డికి రాజకీయ దురంధరుడిగా పే రున్నది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎ మ్మెల్సీగా, మూడుసార్లు మంత్రిగా ఆయన ప నిచేశారు. 45 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో ఇంతవరకు ఒక్క అవినీతి మరక, కుంభకోణం ఆరోపణలు రాలేదంటే ఆయన ఎంత నిబద్ధతతో పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఆయన మాత్రం పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో జీవన్‌రెడ్డి తన శిష్యుడైన ఎల్ రమణ చేతిలో ఓటమి పాలయ్యారు. 1996లో ఎల్ రమణ కరీంనగర్ ఎంపీగా గెలువడంతో జగిత్యాల నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో జీవన్‌రెడ్డి విజయం సాధించారు. 1996 నుంచి 2004 వరకు రెండు టర్మ్‌లు జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అదే పార్టీలో కొనసాగారే తప్ప పార్టీ మారే ఆలోచన చేయలేదు.
2004లో వరుసగా మూడో సారి గెలిచి రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో ఓటమి పాలైనా కాంగ్రెస్‌లోనే కొనసాగారు. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ఉద్యమనేత, కేసీఆర్ తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ తన సన్నిహితుడైన వినోద్‌కుమార్‌ను జీవన్‌రెడ్డి వద్దకు పంపించినా కేసీఆర్ ఇ చ్చిన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించా రు. 2014లో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో జీవన్‌రెడ్డి ఒకరు.
2018లో ఓటమి పాలైన జీవన్‌రెడ్డి 2019లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మొదటి ప్రాధాన్యతా ఓట్లతో ఘన విజయం సాధించారు. మండలిలో 39 మంది సభ్యులు బీఆర్ఎస్కు చెందిన వారున్నా కాంగ్రెస్‌కు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి మండలిలో తనదైన వాణి వినిపించారు. 2006, 2008లో కరీంనగర్ ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేకున్నా కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు.
పార్టీకి, ప్రజలకు అత్యంత విధేయుడిగా పనిచేసిన జీవన్‌రెడ్డికి 2022లో కాంగ్రెస్ అధిష్ఠానం పీసీసీ పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం పీసీసీ అధ్యక్షుడిగా జీవన్‌రెడ్డిని నియమిస్తూ నియామక ఉత్తర్వులు సైతం సిద్ధం చేసినట్టు వార్తలొచ్చాయి. రేపో మాపో ఉత్తర్వులు వెలువడుతాయన్న ప్రచారం జరిగింది. సీనియర్ కాబట్టి సముచిత గౌరవమే దక్కుతుందన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు అప్పట్లో వ్యక్తం చేశాయి.
ఈ క్రమంలో అప్పుడే టీడీపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి, తన అర్థబలంతో నాగార్జున సాగర్ ఉపఎన్నికను బూచిగా చూపుతూ జీవన్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష స్థానం రాకుండా మాజీమంత్రి జానారెడ్డిని ప్రయోగించి అడ్డుకున్నారన్న చర్చ కొనసాగింది. బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీల్లో కొనసాగి, ఓటుకు నోటు కేసులో బాహాటంగా ప ట్టుబడిన రేవంత్‌రెడ్డి సీనియర్ మోస్ట్ అయిన జీవన్‌రెడ్డికి రావాల్సిన పీసీసీ పీఠాన్ని రా కుండా అడ్డుకోవడాన్ని సీనియర్లు అప్పట్లో తీవ్రంగా నిరసించారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రెడ్డి సామాజికవర్గంలో సంతోషం కనిపించినా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలి పోయింది.
రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను, ఏండ్ల తరబడి రేవంత్‌రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచి కాంగ్రెస్‌కు అన్ని విధాలా ఇంధనంగా మారిన రెడ్డి సామాజికవర్గంలో నేడు భిన్నమైన వైఖరులు, ఆలోచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ రెడ్డి సామాజికవర్గం అన్ని రకాలుగా మద్దతు పలుకుతూ వస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఏ సందర్భంలో అధికారంలోకి వచ్చినా, రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులే కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. పార్టీకి, పార్టీ అభ్యర్థులకు ఆదాయ వనరుల నుంచి మొదలుకొని అవసరాలను రెడ్డి సామాజికవర్గమే సమకూర్చుతూ వచ్చింది.
రెండున్నరేండ్ల క్రితం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెడ్డి సామాజికవర్గం పోలరైజ్డ్‌గా మారి కాంగ్రెస్, రేవంత్‌రెడ్డికి బాహాటంగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్‌రెడ్డి సీఎం కావడంలో రెడ్డి సామాజికవర్గానిది కీల క పాత్ర అనడంలో సందేహం లేదు. కాగా రెండున్నరేండ్లలోనే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకుల్లో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి, ప్రభుత్వం, పార్టీపై ఆగ్రహం పెల్లుబుకుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
సీఎం వ్యవహార శైలి, పాలనలో వైఫల్యంతో రెడ్డి సామాజికవర్గంలో తీవ్ర నైరాశ్యం అలుముకున్నదన్న మా టలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్న సామాజికవర్గాన్ని, సీనియర్ నాయకులను చిన్నచూపు చూస్తూ అవమానించేలా ప్రవర్తించిన రేవంత్‌రెడ్డి వైఖరిపై వారు విసిగిపోయారన్న ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి ఫిరాయింపుదారులను పార్టీలోకి తీసుకొచ్చి దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు నమ్మకంగా పనిచేస్తున్న క్యాడర్‌ను ఇబ్బందులు పెట్టడంపైనా వారు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు.
జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొని, సీనియర్ నాయకుడైన జీవన్‌రెడ్డిని తీవ్రంగా అవమానించడంతో ఆయన విధిలేని పరిస్థితుల్లో రాజీనామా సమర్పించారు. రేవంత్‌రెడ్డి ఇరువై నెలల కాలంలో తనను ఏనాడూ ప్రశాంతంగా నిద్ర పోనివ్వలేదని జీవన్‌రెడ్డి స్వయంగా తన ఆంతరంగికుల వద్ద వాపోయారు. కష్టకాలంలో పార్టీతోనే ఉన్న జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆత్మగౌరవం కోసం పార్టీని వీడటం గమనార్హం. కాంగ్రెస్‌లో తనకే కాదు, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న చిన్నారెడ్డి లాంటి నాయకులకు సైతం అవమానాలు ఎదురవుతున్నాయని ఆయన సభాముఖంగా ప్రకటించారు.
చిన్నారెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అవమానానికి ఏకంగా ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడని సంచలన ప్రకటన చేశారు. విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం, పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆహ్వానించారు. నిశ్శబ్దాన్ని ఛేదించి బీఆర్ఎస్లో చేరేందుకు, ఉద్యమనేత కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు సమ్మతి తెలుపడమే గాక, కేసీఆర్‌తో ‘అన్నా.. నీతో కలిసి పనిచేసేందుకు దేవుడే నన్ను పంపించాడు’ అంటూ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి.
జీవన్‌రెడ్డి బాటలోనే చాలా మంది సీనియర్లు రేవంత్‌రెడ్డికి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, జగ్గారెడ్డి లాంటి వ్యక్తులే కాదు, రేవంత్‌రెడ్డి పిలిచి సలహాదారుగా పదవి కట్టబెట్టిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇటీవల తన అసంతృప్తిని బాహాటంగానే వెల్లగక్కారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా? ఉంటే అదిపనిచేస్తున్నదా? గింత ఘోరమా? ఈ రాజకీయం పాడైపోను. దరిద్రపు రాజకీయం’ అంటూ శ్రీనివాస్‌రెడ్డి నిప్పులు కక్కారు.
రాష్ట్ర రాజకీమాల్లో రివర్స్ వలసల ప్రస్థానం ప్రారంభమైంది. అధికార పార్టీని కాదని ప్రతిపక్ష బీఆర్ఎస్లో చేరేందుకు కాంగ్రెస్ నేతలు ముందుకొస్తున్నారు. జీవన్‌రెడ్డి బాటలో నడిచేందుకు చాలామంది సీనియర్లు సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్‌రెడ్డినే బీఆర్ఎస్ సాదరంగా ఆహ్వానించి గౌరవించిన నేపథ్యంలో ఆయన బాటలో సీనియర్లు కూడా కాంగ్రెస్‌ను వీడే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. సంప్రదాయబద్ధంగా కాంగ్రెస్‌కు మద్దతిస్తూ వచ్చిన సామాజికవర్గానికి చెందిన నేతలే జీవన్‌రెడ్డి బాటలో పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
జీవన్‌రెడ్డి ప్రభావం ఉన్న ఉత్తర, దక్షిణ తెలంగాణ అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల నాయకుల్లోనూ ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు మరో రెండున్నరేండ్ల వ్యవధి ఉండటంతో చేరికల విషయంలో కొంత ఆలస్యం జరిగినా, త్వరలోనే చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు రాంరాం చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి వల్లే కాంగ్రెస్ నిండా మునిగిపోతున్నదన్న రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయినా జీవన్‌రెడ్డి లాంటి నాయకులు పార్టీని తిరిగి పట్టాలు ఎక్కించేవారని, కాంగ్రెస్‌కు ఐదేండ్లకు కాకపోయినా, పదేండ్లకు మళ్లీ అవకాశాలు దక్కేవని చెప్తున్నారు.