తెలంగాణ కాంగ్రెస్‌లో పెత్తనం సీనియర్ల చేతిలోంచి జారిపోతున్నది. ఒకప్పుడు ఆ పార్టీ పెద్దలు ఎన్నికల్లో గెలిచినా, ఓడినా వారి గౌరవంలో తేడా వచ్చేది కాదు. ఎన్నికల్లో గెలుపోటములు మామూలే అన్నట్టుగా పార్టీపై వారి పట్టు యథావిధిగా కొనసాగేది. అయితే రేవంత్ రాజరికం వచ్చాక వారి హోదాలు తలకిందులవుతున్నాయి. ఎనిమిదేండ్ల కింద కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ నలభై ఏండ్ల అనుభవమున్న సీనియర్లను పక్కనపెడుతున్న వైనం వారిని తీరని వేదనకు గురిచేస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం కాంగ్రెస్ సీనియర్ నేత అయిన హనుమంతరావు ఎంత తండ్లాడినా ఫలితం దక్కలేదు. అలిగి వెళ్లిపోయి న మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షు డు పొన్నాల లక్ష్మయ్యకు అవమానాలు, తిట్లే మిగిలాయి. ముఖ్యమంత్రిగా రేవంత్‌ను తప్పదన్నట్టుగా భరిస్తూ సీనియర్లు సర్దుకుపోతున్నారు. పదిహేను మంది గల మంత్రివర్గంలో ఏడుగురు బయటివారే. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన గెలుపు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఖాతాలో పడినందువల్ల సీనియర్లకు ఈ దుస్థితి వచ్చింది.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి అనుభవిస్తున్న అమర్యాద మాత్రం బయటివారిని సైతం బాధిస్తున్నది. కాంగ్రెస్‌కు వరుస విజయాలు అందించిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీలో ఓటమి చవిచూశారు. దాన్ని పక్కనపెట్టి ఆయన గత వైభవం కొనసాగేలా పార్టీ సహకరించాలి. అందుకు భిన్నంగా ఆయనను అన్ని వైపుల నుంచి పార్టీ చిక్కులు పెడుతున్నది.
పార్టీలు మారిన జగ్గారెడ్డికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా దక్కింది. కేశవరావు కప్పగంతులేసినా ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ హోదాలో ముఖ్యమంత్రి పక్కన కనబడుతున్నారు. వారికన్నా సీనియర్ అయి ఉండి, పార్టీ జెండాను దింపకుండా మోస్తున్న జీవన్‌రెడ్డికి మాత్రం సొంత పార్టీ పాలనలో ఎన్నడూ లేని ఇబ్బందులు వస్తున్నాయి. జగిత్యాల నియోజకవర్గంలోని దేవాలయ కమిటీల్లో కూడా తన కార్యకర్తలను నియమించుకునే కనీస పలుకుబడి కూడా ఆయనకు లేకుండాపోయింది. జగిత్యాలలో కాంగ్రెస్ అంటే జీవన్‌రెడ్డి అని పేరుపొందిన ఆయనకు ఈ అవమానకర విధానాలు ఎంతో మానసిక క్షోభకు గురిచేస్తున్నట్టు ఈ మధ్య మరోసారి బయటపడింది.
జగిత్యాల సమీపంలోని పౌలస్తేశ్వర, లక్ష్మీనర్సింహస్వామి ఆలయాల కమిటీల్లో పదవుల పంపిణీ ఆయనను ఎంతో బాధించింది. వాటిని హస్తం కార్యకర్తలకు కాకుండా ఈ మధ్యనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి దూకిన వారికి కట్టబెట్టడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఇటీవల ధర్మపురికి వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు జీవన్‌రెడ్డి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. జగిత్యాలలో జీవన్‌రెడ్డి నుంచి పార్టీ పెత్తనం మారిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కండువా మార్చడమే. ఏడాది క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రహసనం జరిగింది. సంజయ్‌ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే విషయంలో జీవన్‌రెడ్డి కన్నుగప్పారు. ఆ రోజు నుంచి పార్టీ, ప్రభుత్వ ప్రతినిధిగా సంజయ్ జగిత్యాల పగ్గాలు పట్టుకొని జీవన్ సకల శక్తులను లాగేసుకుంటున్నారు. దాంతో పట్టరాని ఆవేశంతో మంత్రి అడ్లూరిని జీవన్‌రెడ్డి అడ్డంగా నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను కడిగేశారు. జీవన్ ప్రశ్నలకు మంత్రి ఎలాంటి సమాధానం, సంజాయిషీ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం శూన్యమే అన్నట్టుగా అడ్లూరి వైఖరి కనబడింది.
ఆ కోపంలో జీవన్‌రెడ్డి మాట్లాడిన మాటలు నేటి కాంగ్రెస్ పాలన, విధానాలను స్పష్టం చేశాయి. ‘ఇది పట్టాదారుల పాలన కాదు, కౌలుదారులు పాలన’ అని ఒక్క మాటలో ఆయన రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిర్వచించారు. పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్‌కి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదని, అయినా ఆయన నిర్ణయాలే చెల్లుతున్నాయని అన్నారు. ‘నన్ను కొద్దికొద్దిగా చంపే బదులు ఒకే దెబ్బతో చంపేస్తే బాగుంటుంది. నేను పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే బయటికి పంపండి. వలసదారుల ముందు తలవంచే ప్రసక్తే లేదు’ అని నిక్కచ్చిగా చెప్పారు. ఎంత గొంతు చించుకు న్నా జీవన్‌రెడ్డి వేదనకు ఉపశమనం దక్కేలా లేదు. రాబోయే రోజుల్లో తనకు గాని, అనుచరులకు గాని ఎమ్మెల్యే టికెట్, ఇతర అవకాశాలు దక్కే దారులు ఇప్పటికే మూతపడ్డాయి.
జాతీయ కాంగ్రెస్ పార్టీకి దేశంలోని ఒక రాష్ట్రంలో పాలన కావాలి, రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి అవ్వాలన్న కాంక్ష తీరాలి. గత ఎన్నికల్లో అది సాధ్యపడినా ఈ బంధం చాలా బలహీనమైంది. ఒకరి పట్ల ఒకరు విశ్వాసం ఉన్నట్టు నటిస్తున్నారు తప్ప, అంతా అప నమ్మకమే. ప్రభుత్వం అమలు చేస్తున్న అరకొర హామీలను రేవంత్‌రెడ్డి సొంత ఖాతాలో వేసుకుంటున్నారు తప్ప, ఆ క్రెడిట్‌ను కాంగ్రెస్ పెద్దలకు
దక్కనీయడం లేదు.
రైతు రుణమాఫీపై సభ పెట్టి రాహుల్‌గాంధీని పిలుస్తామన్న మాట పక్కకుపోయింది. మరోవైపు జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు కూడా రేవంత్‌పై తమ అసంతృప్తిని కక్కలేక, మింగలేక సర్దుకుపోతున్నారు. తాను ముఖ్యమంత్రి కావాలని రేవంత్ అలవికాని హామీలను గుప్పించి ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. తెలంగాణలో తమ పాలన ఉన్నా జాతీయ నేతలు ఇక్కడ ముఖం చూపించలేని పరిస్థితి వచ్చింది. మాటలతో కోటలు కడుతున్న ముఖ్యమంత్రి మిగతా హామీలను నెరవేర్చే ఆలోచనలో లేరని వారికి అర్థమైంది. ఇలా వ్యక్తిగత స్వార్థాలకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం బలి కావడం దురదృష్టకరం.
– బద్రి నర్సన్