పెద్ద కొడప్గల్, నవంబర్ 26: జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సౌదాగర్ గంగారాం బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయ్యాలని తన అనుచరులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని తన నివాసంలో గంగారాం ఆదివారం విలేకరులతో మాట్లాడారు. 46 ఏండ్లుగా కాంగ్రెస్‌ను నమ్ముకుని పనిచేశానని, పార్టీలు మారకుండా ఉన్న నాకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో దళితుడినైన తనకు కాకుండా మున్నూరుకాపా? ఎస్సీయా? తెలియని వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి కాంగ్రెస్‌కు ద్రోహం చేశాడని, ఇరిగేషన్ మంత్రిగా వేయి కోట్ల అవినీతికి పాల్పడిండని, అయినా ఆయనకు బోధన్‌లో టికెట్ ఇచ్చారని విమర్శించారు. ఎలాంటి ఆరోపణలు లేని తనకు మాత్రం టికెట్ ఇవ్వలేదని వాపోయారు. జుక్కల్ నియోజకవర్గంలో గంగారాం పని అయిపోయిందని ప్రచారం చేస్తున్న వారికి తన సత్తా ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతారావును ఓడించాలని, కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండేను భారీ మెజార్టీతో గెలిపించాలని తన అభిమానులను కోరారు.