హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదవి రాకపోతే ఎవరికైనా అసంతృప్తి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం తాను కూడా అసంతృప్తితోనే ఉన్నానని వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యతలేమిటో, రాష్ట్ర నాయకత్వం దేనిని పరిగణలోకి తీసుకొని పదవులు అప్పగిస్తున్నదో మున్ము ందు తెలుస్తుందన్నారు. అధిష్ఠానం సామాజిక న్యాయం పాటిస్తే.. దశాబ్దాలపాటు పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత అధిష్ఠానంపై ఉంటుందని స్పష్టంచేశారు.
మినిస్టర్ క్వార్టర్స్‌లోకి అధికార పార్టీ పెద్ద
హైదరాబాద్, మార్చి25(నమస్తే తెలంగాణ): అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఒకరు త్వరలో మినిస్టర్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలోకి గృహప్రవేశం చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ మంత్రికి కేటాయించిన అధికారిక నివాసాన్ని, చట్టవిరుద్ధంగా ఆయనకు బదలాయిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం శాసన వ్యవహారాల శాఖ రూ.70 లక్షలు ఖర్చు చేసి ఆ ఇంటిని ఆధునీకరిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకే చెందిన ఓ సీనియర్ నేత ఈ విషయంపై ఏఐసీసీకి లేఖ రాసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఆయనకు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ప్రభుత్వం పైలట్ వాహనాన్ని కేటాయించిందని, ఇప్పుడు క్వార్టర్ ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.