హైదరాబాద్ : 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 26 తేదీన తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘గణతంత్ర భారత్ – జాగ్రత్త భారత్’ పేరిట హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో సెమినార్ నిర్వహించనుంది. ఈ సెమినార్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడం, సవాళ్లు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, మహిళా సాధికారత, మైనారిటీలు, బలహీన వర్గాలు, కులగణన వంటి మొత్తం 16 అంశాలపై ఈ సెమినార్లో చర్చించనున్నారు.
భారత రాజ్యాంగం(Constitution) అమలు జరిగిన నాటి నుంచి నేటి వరకు దాని స్ఫూర్తిని అనుసరించి ప్రజలకు దక్కాల్సిన హక్కులు ఎంత మేరకు దక్కాయన్న చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి అభిప్రాయ పడింది. రాజ్యాంగం పట్ల ప్రజలకు సంపూర్ణ అవగాహన ఏర్పడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని పాలకులు అది ప్రతిపాదించిన హక్కులను పౌరులకు దక్కేలా కృషి చేయాలని కోరింది.
భారత రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు, ఫలాలను మరింత విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలకు దక్కేందుకు ప్రజలందరి భాగస్వామ్యం అవసరమన్నారు. కాబట్టి ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సెమినార్లో ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో నవీన్ ఆచారి, చరణ్ పసుల, శ్రీకాంత్ గౌడ్, లింగం, డాక్టర్ సత్య, వసుమతి, కృష్ణ కిశోర్, శ్రీనివాస్ గౌడ్, మాడ హరీశ్ రెడ్డ, జన్ము రాజు, అశోక్ యాదవ్, గాజుల అరుణ్ పాల్గొన్నారు