హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ) : ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలకు బాగా అలవాటుపడిన నేటి తరం ప్రజలు ప్రతి విషయానికి వాటిపైనే ఆధారపడుతున్నారు. కొంతమంది తమకున్న మిడిమిడి జ్ఞానాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు పంచడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైద్య చికిత్సకు సంబంధించిన వీడియోలు (రీల్స్) బాగా వైరల్ అవుతున్నాయి. కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సకయ్యే ఖర్చుకు భయపడే సామాన్య ప్రజలు ఈ వీడియోల్లో బోధించే చికిత్సలపై ఆధారపడుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కొన్ని దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులకు సైతం ఎటువంటి ఖర్చు లేకుండా చికిత్సను సూచించే వీడియోలో యూట్యూబ్‌లో వేలల్లో దొరుకుతున్నాయి.
గూగుల్, యూట్యూబ్‌లకు తోడు కొత్తగా వచ్చి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్ జీపీటీలో కూడా రోగాలకు చికిత్సలు లభిస్తున్నాయి. దీంతో చాలామంది తమకు కలిగే శారీరక రుగ్మతలకు ఎటువంటి మాత్రలు వేసుకోవాలో చాట్ జీపీటీని అడిగి తెలుసుకుంటున్నారు. దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల లక్షణాలు ప్రాథమికంగా సాధారణంగానే ఉంటాయి. ఉదాహరణకు డయాబెటిస్ వచ్చిన వారికి తొలుత అలసట, నీరసం త్వరగా వస్తాయి, రక్తపోటుకు గురయ్యేవారికి తొలుత తలనొప్పి రావచ్చు అలాగే హృద్రోగులు, కిడ్నీ బాధితులకు కూడా రోగ లక్షణాలు తొలుత సాధారణంగానే ఉంటాయి. రోగలక్షణాలను బట్టి గూగుల్, చాట్‌జీపీటీలపై ఆధారపడి సొంత వైద్యం చేసుకుంటే ఆ తరువాత అది ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
‘రోగం వస్తే గూగుల్, చాట్‌జీపీటీ వంటి సామాజిక మాధ్యమాలను కాకుండా దవాఖానకొచ్చి వైద్యున్ని సంప్రదించండి. గూగుల్ రోగులందరికీ కామన్‌గా అవసరమైన మందులను మాత్రమే సూచిస్తుంది. వైద్యులు రోగిని పరీక్షించి అవసరమైన మోతాదులో మాత్రలు, చికిత్సనందిస్తారు. ఏఐ అనేది డ యాగ్నోసిస్లో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాని అదే వైద్యం చేయదు. అది కేవలం వైద్యుల సూచనల ప్రకారం పనిచేసే సాధనం మాత్రమే. శస్త్ర చికిత్సలు వైద్యుడే చేయాలి. బద్ధకం, దవాఖానకు వెళితే డబ్బులు ఖర్చవుతాయనే కారణంగా చాలామంది ఆన్లైన్ వైద్యం చేసుకుంటున్నారు. ఆయాసం కాస్త ఎక్కువై నిమోనియాకు దారితీసేంత వరకూ గూగుల్ ట్రీట్మెంట్ మీదనే ఆధారపడుతున్నారు. రోగం మొదట్లోనే వైద్యున్ని సంప్రదించకపోవడం వల్ల చివరికి రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది.