CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లారు. వారం కిందటే ఢిల్లీకి వెళ్లిరాగా.. మరోసారి పిలుపు రావడం గమనార్హం. రేవంత్‌రెడ్డి సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీకి వెళ్లడం ఇది 20వసారి. వారంతా రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉంటారని, అధిష్ఠానంతో చర్చలు జరుపుతారని సమాచారం. పీసీసీ అధ్యక్ష పదవి మార్పుపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం కొన్ని నెలలుగా నలుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా తేల్చాలని కోరనున్నట్టు సమాచారం. అలాగే సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణకు రావాలని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని, రుణమాఫీపై వరంగల్‌లో నిర్వహించనున్న సభకు రావాలని రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తారని తెలుస్తున్నది. మంత్రివర్గ విస్తరణ, స్థానిక ఎన్నికలపై చర్చించనున్నట్టు సమాచారం.
పీసీసీ చీఫ్ పదవికి ఇన్నాళ్లు అనేక పేర్లు వినిపించగా, ప్రస్తుతం ఓ మంత్రి పేరు తెరమీదికి వచ్చింది. క్యాబినెట్లో సీఎంకు సన్నిహితంగా ఉన్న మంత్రికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెడతారనే చర్చ జరుగుతున్నది. అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని మారుస్తారని ప్రచారం జరుగుతున్నది.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మంత్రులు దామోదర రాజనరసింహను, దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించినట్టు శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. వీలైనంత తొందరలో వర్గీకరణ పూర్తిచేసి అమలుచేస్తామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. మందకృష్ణ వెంట ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వీరేశం, సత్యనారాయణ, యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోతుపల్లి ఉన్నారు.
సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ పంటలకు సంబంధించి అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలు చేయాలని జాక్వెలిన్‌కు సీఎం సూచించారు. ఇక్రిశాట్ను సందర్శించాలన్న ఆహ్వానం మేరకు త్వరలో వస్తానని హామీ ఇచ్చారు. సచివాలయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) లోగోను సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, కమిషన్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ డాక్టర్ జెలాలెం బీ టఫెస్సె, ఉమెన్ సేఫ్టీ వింగ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్ సీఎం రేవంత్‌రెడ్డిని సచివాలయంలో కలిశారు.
సీఎం రేవంత్ ఎనిమిదిన్నర నెలల్లోనే 20 సార్లు ఢిల్లీకి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఒకటి, రెండుసార్లు తప్ప మిగతావన్నీ అధిష్టానం చుట్టూ చక్కర్లు కొట్టేందుకే ఢిల్లీకి వెళ్లారని చెప్తున్నారు. ఇలా రూ.కోట్ల ప్రజాధనాన్ని పార్టీ పనులకు వాడుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి కనీసం రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించారా? ఒక పెద్ద ప్రాజెక్టునైనా, పెట్టుబడులనైనా తీసుకొచ్చారా? అని నిలదీస్తున్నారు. కొత్త పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ అంటూ నెలలుగా నాన్చడంపైనా మండిపడుతున్నారు. గత నాలుగైదు పర్యటనలు ఇదే పేరుతో చేశారని, అయినా ఫలితం ఏమున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 24న ఢిల్లీకి వెళ్లి ఏకంగా ఐదు రోజులు అక్కడే తిష్టవేసినా, రాష్ట్ర పాలనను పక్కనబెట్టి ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని గుర్తుచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి దీపాదాస్ మున్సీ, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, సలహాదారులు హర్కర వేణుగోపాల్ వెళ్లారు. శుక్రవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.