హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ప్రతిక్షణం ప్రజల పక్షాన అప్రమత్తంగా ఉంటూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, అధికారుల అవినీతిని ప్రశ్నిస్తున్న, ప్రజల సమస్యలను బయటపెడుతున్న ‘తెలుగు స్ర్కైబ్’ డిజిటల్ మీడియాపై ప్రభుత్వం కక్షకట్టింది.
ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్నందుకు ఏకంగా రాజద్రోహం కేసు పెట్టింది. ఆ నిర్వాహకుల వివరాలు అందించాలని ఎక్స్ సంస్థకు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ నుంచి లేఖ రాయించింది. అందులో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్)-2023లోని సెక్షన్ 94, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టం-2008లోని సెక్షన్ 43(ఎఫ్) కింద నోటీసులు ఇచ్చారు. దీంతో తెలుగు స్ర్కైబ్ నిర్వాహకులు స్పందించారు. తమ ఎక్స్ ఖాతా వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘మేము ఉగ్రవాదులం కాదు, రేవంత్‌రెడ్డి! ‘అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్'(యూఏపీఏ) కింద మా హ్యాండిల్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ పోలీసులు సేకరించాలని చూడటం తెలుగుస్రైబ్ బృందాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రధానంగా ఉగ్రవాదం, దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు కలిగించే చర్యలను అరికట్టడానికి ఉద్దేశించిన ఈ చట్టాన్ని మాపై ప్రయోగించడం అన్యాయం. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొకేయడానికి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత, ఇప్పుడు అత్యంత కఠినమైన ఉ.పా చట్టాన్ని ప్రయోగించడం వారి తాజా ఎత్తుగడగా కనిపిస్తున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ నోటీసులో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం’ అని పేర్కొన్నారు.
‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వార్తలను కవర్ చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా న్యూస్ ప్లాట్‌ఫామ్ తెలుగుస్రైబ్. మేము ప్రజల పక్షాన వార్తలను అందిస్తున్నందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని క్రమం తప్పకుండా లక్ష్యంగా చేసుకుంటున్నది. ఒకవైపు రాహుల్‌గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని రాజ్యాంగబద్ధమైన పాలన గురించి ప్రసంగాలు చేస్తుంటే, మరోవైపు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛ వంటి ప్రాథమిక హకులను కాలరాస్తున్నది. ఇది ఇందిరాగాంధీ నాటి ఎమర్జెన్సీ కాలం పరిస్థితులను గుర్తుకుతెస్తున్నది. నోరు నోక్కేయాలని ఈ దుర్మార్గపు ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.