హైదరాబాద్ : ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూసేవాడని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం అమీర్ పేట డివిజన్ గురుద్వార్ వద్ద నిర్వహించిన శివాజీ జయంతి ర్యాలీలో పాల్గొని ఛత్రపతి శివాజీ కి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ శివాజీ భవానిదేవి భక్తుడైనప్పటికీ కేవలం గుళ్లు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడని పేర్కొన్నారు.
శివాజీ లౌకిక పాలకుడని, అన్ని మతాల ప్రజలను సమాన గౌరవం కల్పించారని చెప్పారు. మాస్టర్ స్ట్రాటజిస్ట్‌గా పేరుగాంచిన ఛత్రపతి శివాజీ మొఘలులపై అనేక యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించాడని వెల్లడించారు. శివాజీ అనేక యుద్ధాలు చేసినా ఎన్నడూ కూడా పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదన్నారు.
యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో యుద్ధం చేయలేనివారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసిన మహానాయకుడని ప్రశంసించారు. నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం ప్రజలకు ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రికి నిర్వహకులు ఛత్రపతి శివాజీ ప్రతిమను అందజేసి శాలువాతో సత్కరించారు.