Telangana | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన మీద రహస్య సర్వే జరుగుతున్నది. కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు అందించిన దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సర్వే సాగుతున్నది. రేవంత్‌రెడ్డి పరిపాలన తీరు తెన్నులు, ప్రజల మనోభావాల మీదనే దృష్టి పెట్టి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రశ్న ఏదైనా సరే! జనం పదే పదే కేసీఆర్ పేరును తల్చుకుంటున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సర్వే ఎవరు చేయించారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై పలు సంస్థలు సర్వే చేస్తున్నప్పటికీ ప్రధానంగా రెండు సంస్థల సర్వేల మీద ఆసక్తి నెలకొన్నది. సీఎంగా రేవంత్ ఓకేనా? సూర్యాపేట జిల్లా నూతన్‌కల్, మద్దిరాల మండలాల్లోని పలు గ్రామాల్లో
కొంతమంది యువకులతో కూడిన బృందా లు సర్వే నిర్వహించాయి. రేవంత్‌రెడ్డి ఏడాది పాలన ఎలా ఉంది? అనే ప్రశ్నతో మొదలై మీ ప్రాంతం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? కేసీఆర్ పాలనతో పోల్చినప్పుడు రేవంత్‌రెడ్డి పాలన ఎలా ఉంది? వంటి 35 ప్ర శ్నలతో సమాచారం సేకరించారు. కాంగ్రెస్ హా మీలు ఏ మేరకు అమలు చేశారు? ప్రతిపక్షాలపై సీఎం చేస్తున్న విమర్శలను ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? సీఎంగా రేవంత్‌రెడ్డికి ఎన్ని మార్కు లు వేస్తారు? రేవంత్‌రెడ్డి కాకుండా వేరే ఎవరైనా సీఎంగా ఉంటే ఎలా ఉంటుంది? అనే ప్రశ్నల ను అడిగినట్టు సర్వేలో పాల్గొన్న వాళ్లు చెప్తున్నా రు. ఎర్రపహాడ్, చిల్పకుంట్ల గ్రామాల్లో రేవంత్‌రెడ్డి ఏడాది పాలన ఎలా ఉంది? అని ఎన్యూమరేటర్లు అడిగిన ప్రశ్నకు ‘తూతూ మంత్రం తుమ్మకాయ పాలన’ అన్నట్టే ఉందంటూ కొందరు వ్యంగ్యంగా స్పందించినట్టు తెలిసింది.
ఏడాదిలో ఎన్ని సంక్షేమ పథకాలు అందాయనే వివరాలను కూడా సర్వేలో సేకరించారు. పింఛన్ పెంచుతా అని పెంచకపాయే. కొత్త పింఛన్లు లేకనేపోయే ఇంక ఆయన చేసింది ఏముంది? అని ప్రజలు నిట్టూర్చినట్టు తెలుస్తున్నది. మూసీ పరీవాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలంటూ రెడ్ మార్క్ వేసిన కుటుంబాల నుంచి కూడా సమాచారం సేకరించారు. ఇక్కడ పూర్తిస్థాయిలో ప్రజలు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగానే స్పందించినట్టు సమాచారం. మేం కొనుక్కున్న ఇండ్ల మీదికి హైడ్రాను తీసుకొచ్చి మా నోట్లె మన్నుబోసిండు. మంత్రులు, పెద్ద మనుషులు కూడా మార్కు దాటి కట్టిండ్రని రేవంత్‌రెడ్డే చెప్పిండు కదా! వాళ్ల ఇండ్లు ఎందుకు కూల్చుతలేరు? అని ఎన్యూమరేటర్లను ప్రజలు ఎదురుప్రశ్నించినట్టు తెలిసింది.
కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రధానంగా రెండు పెద్ద సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలపై గాంధీభవన్ వర్గాలు, ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. జాతీయ స్థాయిలో పేరున్న ఓ సంస్థ కూడా సర్వే నిర్వహిస్తున్నది. సీఎంగా ఓ మంత్రి అయితే ఎలా ఉంటుం ది? అని ఎన్యూమరేటర్లు అడిగితే ‘ఆయనొద్దు.. ఈయనొద్దు కేసీఆరే మళ్లీ రావాలని జనం చెబుతున్నారని తెలిసింది. సర్వే సంస్థ అధినేతను ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి సంప్రదించగా సర్వే నిర్వహిస్తున్న మాట వాస్తవమే అని స్పష్టంచేశారు. సర్వేలో అడుగుతున్న ప్రశ్నలు, ఫలితాలను డిసెంబర్ రెండోవారంలోగా వెల్లడిస్తామని చెప్పారు. స్వ చ్ఛందంగా సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కానీ దక్షిణ తెలంగాణకు చెందిన సీనియర్మంత్రే సర్వే చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ మంత్రే చేయించారా లేక అధిష్ఠానం ఆదేశాల మేరకు సర్వే చేయిస్తున్నారా? అని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.