హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు టీచర్లకు రెండో విడత శిక్షణ మంగళవారం ప్రారంభమయ్యింది. 550 మండలాల్లో ఐదు రోజులపాటు 89,378 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఆన్లైన్ ద్వారా టీచర్లనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం కలిగేలా కాలానుగుణంగా టీచర్లు బోధనాపద్ధతులను మెరుగుపర్చుకోవాలని సూచించారు.
శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలుచేయాలని, తద్వారా రాష్ర్టాన్ని విద్యాప్రమాణాల పరంగా ముందు వరుసలో నిలబెట్టాలని కోరారు. మొదటి విడతలో 17,771 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వగా, రెండో విడతలో 89వేల మందికి శిక్షణ ఇస్తున్నారు.