హైదరాబాద్: రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల్లో (Medical Colleges) రెండో రోజూ ఈడీ సోదాలు (ED Raids) కొనసాగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లోని మెడికల్ కాలేజీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దాడులు చేస్తున్నారు. ఆయా కళాశాలల యాజమానుల ఇండ్లు, కార్పొరేట్ కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. పీజీ సీట్లు (PG Seats) బ్లాక్ చేసి అధిక డబ్బులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు.
మల్లారెడ్డి మెడికల్ కాలేజీతోపాటు ఎల్బీనగర్లోని కామినేని మెడికల్ కాలేజీ, ఎస్వీఎస్, ప్రతిమ, డెక్కన్, మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజీ, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, మెడిసిటీ మెడికల్ కాలేజీల్లో బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ సోదాలు కొనసాగాయి. కాగా, హైదరాబాద్‌లోని కామినేని దవాఖానలో తనిఖీలు ముగినట్లు సమాచారం. సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి ఆయా కళాశాలలకు చెందిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కాలేజీలకు చెందిన కీలక పత్రాలను, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈడీ సోదాల నేపథ్యంలో ఆయా వైద్యకళాశాలలు, వాటి దవాఖానల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అత్యవసర రోగులను తప్ప మరెవరినీ లోపలికి అనుమతించలేదు.