హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థులు వాహనాల ద్వారా ఓటర్లను పోలింగ్ బూత్‌కు తరలించడం నేరమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్పష్టంచేసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏవిధంగానూ ఓటర్లను పోలింగ్స్టేషన్ల వద్దకు తరలించకూడదని, అలా చేస్తే అది నేరపూరిత చర్య అని హెచ్చరించింది. కుల, మత, భాషా పరమైన విభేదాలను సృష్టించేలా ఎవరూ ప్రచారం చేయకూడదని కూడా సూచించింది. స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) ఎన్నికల నిర్వహణ కోసం 2026వ సంవత్సరపు నూతన ఎన్నికల నియమావళిని (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్-ఎంసీసీ) రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఈ నిబంధనలు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది. ఈ నియమావళి రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వర్తిస్తుందని స్పష్టంచేసింది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడానికి, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించడానికి ఎంసీసీని అమలుచేస్తున్నట్టు తెలిపింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించాలో సూచించే నిబంధనల సమాహారమే ఈ ఎన్నికల నియమావళి అని పేర్కొన్నది. అధికార యంత్రాంగం దుర్వినియోగం కాకుండా చూడటం, ఓటర్లను ప్రలోభపెట్టడం లేదా భయపెట్టడం వంటి చర్యలను నిరోధించడం దీని ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది.
ఆంక్షలు.. నిబంధనలు ఇలా..
మంత్రులు తమ అధికారిక పర్యటనలను ఎన్నికల ప్రచారంతో కలుపకూడదు. ప్రచారం కోసం ప్రభుత్వ వాహనాలు, విమానాలు లేదా సిబ్బందిని ఉపయోగించడం పూర్తిగా నిషేధం. ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పూర్తి స్థాయి నిషేధం ఉంటుంది. అత్యవసరమైతే ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి తప్పనిసరి. ప్రజాధనంతో ప్రభుత్వ విజయాలను చాటిచెప్పే హోర్డింగ్‌లు, ప్రకటనలను ముద్రణ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవ్వకూడదు. ఇప్పటికే ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త గ్రాంట్లు మంజూరు చేయడం, పునాది రాళ్లు వేయడం, రోడ్లు లేదా తాగునీటి సౌకర్యాల వంటి వాగ్దానాలు చేయడం నిషిద్ధం. అప్పటికే ప్రారంభమై కొనసాగుతున్న పనులను నిరంతరాయంగా చేసుకోవచ్చు. మతం, కులం లేదా భాషా పరమైన విద్వేషాలను రేకెత్తించేలా ప్రసంగాలు చేయకూడదు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికలుగా ఉపయోగించుకోకూడదు. ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం లేదా ఓటు వేయమని లంచం ఇవ్వడం వంటివి శిక్షార్హమైన నేరాలు. వ్యక్తుల ఇళ్లు, ప్రహరీ గోడలపై వారి అనుమతి లేకుండా జెండాలు కట్టడం, పోస్టర్లు అంటించడం నిషేధం. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వాడకంపై నిషేధం ఉంటుంది.
నిధులు విడుదల చేయకూడదు
ఎన్నికలు ముగిసే వరకు కొత్తగా ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ నిధుల విడుదల చేయకూడదు. ప్రభుత్వం ఎటువంటి కొత్త పథకాలు, గ్రాంట్లు ప్రకటించకూడదు. ప్రభుత్వ నిధులతో నడిచే ఆర్థిక సంస్థలు ఈ సమయంలో ఎటువంటి రుణాలను మాఫీ చేయకూడదు. ఎవరైనా ఈ నియమాలను అతిక్రమిస్తే, రాష్ట్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుంది. అధికారుల విషయంలో క్రమశిక్షణా చర్యలతో పాటు, అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది.
ఊరేగింపులకు అనుమతి తప్పనిసరి
బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసు అనుమతి తీసుకోవాలి. ఒకే మార్గంలో రెండు పార్టీలు ఊరేగింపులు నిర్వహించాల్సి వస్తే, ఘర్షణలు జరగకుండా పోలీసుల సమన్వయం తీసుకోవాలి. రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో రాజ్యాంగ విరుద్ధమైన హామీలు ఇవ్వకూడదు. ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా కాకుండా, పారదర్శకమైన సంక్షేమ పథకాలను మాత్రమే ప్రతిపాదించాలి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుంది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల కోసం ప్రతి ఒకరూ సహకరించాలని కమిషన్ కోరింది. ఓటర్లు కూడా ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హకును వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేసింది.