హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) భాగంగా మొదటి దశ ఎన్నికలు జరుగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాల్లో నామినేషన్లు స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబర్ 12న నామినేషన్లను పరిశీలింస్తారు. ఈ నెల 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) పలు సూచనలు చేసింది. నామినేషన్ల సమయంలో తీసుకోవాల్సిన అంశాలపై క్లారిటీ ఇచ్చింది.
ఇందులో భాగంగా జడ్పీటీసీ నామినేషన్లను జిల్లా పరిషత్ కార్యాలయంలో, ఎంపీటీసీ నామినేషన్లను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమర్పించాలని పేర్కొంది. జడ్పీటీసీ నామినేషన్ వేయాలనుకున్న జనరల్ కేటగిరీ అభర్థి అయితే రూ.5 వేలు, రిజర్వేషన్ అభ్యర్థి అయితే రూ.2,500 డిపాజిట్ చేయాలని తెలిపింది. ఎంపీటీసీ నామినేషన్ వేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1,250 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. అదేవిధంగా అభ్యర్థులు పూర్తి డాక్యుమెంటేషన్, ఫోటోలు, డిపాజిట్ రసీదుతో నామినేషన్ వేయాలని పేర్కొంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నామినేషన్ సందర్భంగా దాఖలు చేసే వ్యక్తితో కలిపి ఐదుగురికి మించి కార్యాలయంలోకి రాకూడదని స్పష్టం చేసింది.