హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ (SEC) తాజాగా అభ్యర్థుల అర్హలతపై నిబంధనలను విడుదల చేసింది. ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేయవచ్చు, ఎవరు పోటీ చేయకూడదో వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, అంగన్వాడీలు, గ్రామ సేవకులు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, మత సంబంధమైన సంస్థల చైర్మన్లు, సభ్యులు పోటీచేయడానికి అనర్హులని తెలిపింది. 1995, మే 31 నాటికి ముగ్గురు సంతానం ఉన్నవారు, అదే తేదీనాటికి ముందు ఒకరు ఉండి చట్టం అమల్లోకి వచ్చాక కవలలు జన్మించిన వారు, 1995 మే తర్వాత ఒక కాన్పులో ఒకరు, రెండో కాన్పులో కవలలు జన్మించిన వారు, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించిన వారు పోటీ చేయడానికి అర్హత లేదని వెల్లడించింది. ఇక, ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది.
అదేవిధంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రూపొందించే మ్యానిఫెస్టోలో నెరవేర్చగలిగే, హేతుబద్ధమైన హామీలనే పొందుపర్చాలని వెల్లడించింది. ఆయా హామీలను నెరవేర్చడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునే మార్గాలను కూడా సూచించాలని, ఓటర్లపై అనవసర ప్రభావాన్ని చూపే వాగ్దానాలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. అధికార, రాజకీయ హోదాలు ఉన్నవారిని పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్, జాతీయ, రాష్ట్ర, జిల్లా సహకార సంస్థల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులను ఏజెంట్లుగా పెట్టకూడదని వెల్లడించింది.