హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ, ఉద్యోగార్థులకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్(సీ టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 1న ఉదయం పేపర్ -2, మధ్యాహ్నం పేపర్ -1 పరీక్షను నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. దరఖాస్తులు అధికంగా వస్తే నవంబర్ 30న సైతం పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. వరంగల్, హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచే ప్రారంభంకాగా, అక్టోబర్ 16వరకు గడువు ఉంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కార్మికుల పిల్లలకు అందజేసే స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర కార్మికశాఖ అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ అభినవ్ తివారి ప్రకటనలో తెలిపారు. బీడీకార్మికులు, లైమ్‌స్టోన్, డోలమైట్ మైన్, మైకా, ఇనుపఖనిజం గనుల్లో పనిచేసే కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రీ మెట్రిక్ (1 -10తరగతులు) వారు 30లోపు, పోస్ట్‌మెట్రిక్ (11వ తరగతి నుంచి డిగ్రీ, ప్రొఫెషనల్కోర్సులు) స్కాలర్షిప్స్ కోసం అక్టోబర్ 31 వరకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌ను సంప్రదించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.