Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటికే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పారిశుద్ధ్యలోపం, వైద్యారోగ్యశాఖ వైఫల్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా సైతం విజృంభిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు, వరదలతో వ్యాధుల ముప్పు పొంచి ఉన్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలతో నీళ్లు నిలిచి ఇప్పటికే దోమల సంఖ్య పెరుగుతున్నదని, వరద తగ్గిన తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో కలరాతోపాటు విషజ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని గుర్తు చేస్తున్నారు. వర్ష, వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సహాయక చర్యలపై నిరంతరం పర్యవేక్షించాల్సిన సమయంలో వైద్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులు చట్టాలపై సమీక్షలు నిర్వహించడమే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితులతో సంబంధం లేని అంశంపై గంటలపాటు సమీక్షిస్తూ, సమయం వృథా చేయడంపై మండిపడుతున్నారు. ఇప్పుడే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మరిన్ని వ్యాధులు విజృంభిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దవాఖానల్లో మందుల కొరత నెలకొన్నదని గగ్గోలు పెడుతున్నారని, తగిన విధంగా స్పందించాలని కోరుతున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వరి, పత్తి తదితర పంటలకు చీడపీడల బెడద పెరగవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. నివారణకు రైతులు చర్యలు చేపట్టాలని సూచించారు.
వరి పంటకు బ్యాక్టీరియా, ఎండాకు తెగులు వ్యాప్తిని నివారించేందుకు ఎకరానికి 44 గ్రాముల కాపర్ హైడ్రాక్సైడ్, 60 గ్రాముల స్రైప్టెమైసిన్ సల్ఫేట్ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. పూత దశలో ఉన్న వరి పంటకు కాపర్ శిలింధ్రనాశినులను పిచికారీ చేయరాదు.
పత్తిచేలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎండు తెగులు వ్యాప్తి నివారణకు లీటర్ నీటికి గ్రాము చొప్పున కార్బండాజిమ్ను మొక్కల మొదళ్ల వద్ద పోయాలి. ఆకుమచ్చ, ఆల్బేనేరియా ఆకుమాడు, కాండం మాడు తెగుళ్ల నియంత్రణ కోసం ఎకరానికి 500 గ్రాముల కార్బండాజిమ్, మాంకోజెబ్ మిశ్రమాన్ని లేదా 80 గ్రాముల ట్రైప్లాక్సిస్టోబిన్, టెబుకొనజోల్ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి.