సిరిసిల్ల రూరల్, మార్చి 3 : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సూచనతో రంగనాయకసాగర్ అధికారులు కదిలారు. ఈ నెల 2న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయనను రంగనాయకసాగర్ నుంచి నీళ్లు ఇప్పియ్యాలని తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, నేరెల్ల, చిన్నలింగాపూర్, రామచంద్రాపురం, దాచారం రైతులు కోరిన విషయం తెలిసిందే.
స్పందించిన కేటీఆర్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి నీళ్లు అందివ్వాలని సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా జకాపూర్లోని రంగనాయకసాగర్ కాల్వను ఎస్ఈ రవీందర్, అధికారులు తంగళ్లపల్లి మండల రైతులతో కలిసి సందర్శించారు. రంగనాయక సాగర్ కాల్వ నుంచి జిల్లెల్ల వరకు నీటి సరఫరా చేస్తామని, కాలువలో భూములు కోల్పోయిన రైతులకు పెండింగ్లో ఉన్న పరిహారం రూ.55 లక్షలు త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.