హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలకు పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాకులు నీటమునగడంతోపాటు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించగా, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేసింది. అయితే వరదల దృష్ట్యా దారి మళ్లింపు రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గురువారం అకోల- అకోట, కాచిగూడ- నాగర్సోల్ మధ్య నడవాల్సిన రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా కాచిగూడ – కరీంనగర్, హెచ్.ఎస్ నాందేడ్ – మేడ్చల్ రైళ్లు రద్దయ్యాయి.
హైదరాబాద్-కామారెడ్డి మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భిక్కనూరు-తలమడ్ల, అక్కన్నపేట్-మెదక్ స్టేషన్ల మధ్య పట్టాలపై వర్షపు నీరు చేరింది. కరీంనగర్- కాచిగూడ, మెదక్- కాచిగూడ, బోధన్- కాచిగూడ, కాచిగూడ-మెదక్, నిజామాబాద్- తిరుపతి, ఆదిలాబాద్- తిరుపతి రైళ్లను అధికారులు రద్దు చేశారు. అదేవిధంగా శుక్రవారం కాచిగూడ – నర్కేర్ సర్వీస్‌ను రద్దు చేశామని వెల్లడించారు. గజ్వేల్ – లక్డారం మధ్య రైలు పట్టాలపై వరద నీరు భారీ ప్రహిస్తుండటంతో గురు, శుక్రవారాల్లో మల్కాజిగిరి- సిద్దిపేట సర్వీసు రద్దు చేసినట్లు తెలిపారు.
ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాచిగూడ స్టేషన్లో 9063318082, సికింద్రాబాద్ స్టేషన్లో 040- 27786170, నిజామాబాద్ స్టేషన్లో 970329671, కామారెడ్డి స్టేషన్లో 9281035664 నంబర్ ఏర్పాటు చేశామని, సమాచారం కోసం ప్రయాణికులు ఆయా నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.