హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల భారీగా ఎండలు మండుతున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు పెరిగాయి. అత్యధికంగా కుమ్రంభీం జిల్లాల్లో కెరిమెరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ అప్రమత్తమైంది. పాఠశాల విద్యాశాఖ బడివేళలు కుదించాలని నిర్ణయించింది. రేపటి నుంచి ఉదయం 11.30గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉదయం 8గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. కుదించిన వేళలు వచ్చే నెల 6వ తేదీ వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఎండల తీవ్రత నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యం చేయాలని సీఎస్ సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని కలెక్టర్లకు సూచించారు.