హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు – మన బడి మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు రూపుదిద్దేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన 12 రకాల సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఈ పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1200 పైచిలుకు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. పనులన్నీ పూర్తి చేసుకున్న పాఠశాలలను అన్ని నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 1న ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు. ఏదైనా నియోజకవర్గంలో ప్రారంభానికి సిద్ధమైన పాఠశాలలు ఎక్కువ సంఖ్యలో ఉంటే కొన్నింటిని తదుపరి రోజుల్లో చేసుకోవచ్చని సూచించారు.
జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో సమన్వయం చేసుకొని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆమె ఆదేశించారు. రాష్ట్రంలోని 26,055 స్కూళ్లను మూడేళ్లలో మూడు దశల్లో రూపురేఖలు మార్చేయాలని సంకల్పించిందని తెలిపారు. మొదటి విడతలో 9,123 పాఠశాలలను 3,497.62 కోట్లతో ఆధునికీకరిస్తున్నమని పేర్కొన్నారు.
నాణ్యతలో రాజీపడకుండా..
ఏ పనిలో కూడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా ప్రతి వస్తువును పది కాలాలపాటు ఉండేలా ప్రభుత్వం బ్రాండెడ్ వస్తువులను సమకూర్చుతున్నదని మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ ని, విద్యార్థుల తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను భాగస్వామ్యం చేసి విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.