హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేయడం చూస్తుంటాం. కానీ, మన విద్యాశాఖ కొత్తగా టీచర్లతో స్కూళ్లను తనిఖీ చేయించనున్నది. ఇందుకోసం జిల్లాస్థాయిలో తనిఖీ బృందాలను నియమించనున్నది. ప్రాథమిక పాఠశాలల్లో తనిఖీల కోసం 168, ప్రాథమికోన్నత పాఠశాలల కోసం 35, ఉన్నత పాఠశాలల్లో తనిఖీల కోసం 96 బృందాలను నియమించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారు? వసతులు ఎలా ఉన్నాయనే విషయాలపై ఆరాతీసి నివేదికలను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో 16,474 ప్రాథమిక, 3,100 ప్రాథమికోన్నత, 4,672 ఉన్నత పాఠశాలలున్నాయి. ఒక బృందం 3 నెలల్లో 100 పాఠశాలల చొప్పున తనిఖీచేయాల్సి ఉంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్కూళ్ల తనిఖీ బృందంలో ముగ్గురు సభ్యులుంటారు. ఒకరు నోడల్ అధికారి, ఇద్దరు సభ్యులుగా ఉంటారు. హైస్కూల్ కోసం ఏర్పాటుచేసే తనిఖీ బృందంలో 9 మంది ఉంటారు. బోధనలో 10 ఏండ్ల అనుభవమున్న వారినే ప్యానల్ ఇన్స్పెక్షన్స్ బృందం కోసం ఎంపికచేస్తారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ వీరిని ఎంపిక చేయనున్నది. తనిఖీల కోసం ప్రత్యేక ఫార్మాట్, చెక్లిస్టును అందజేస్తారు. తనిఖీల ఆధారంగా చర్యలుంటాయి.