హైదరరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లో ఉపాధ్యాయులతో తనిఖీలు చేయించాలన్న పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి. విద్యాశాఖ జారీచేసిన ఉత్తర్వులను మెజార్టీ ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తనిఖీ మార్గదర్శకాలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లతో బడుల్లో తనిఖీలు చేయించడమేమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇవేం తనిఖీలు, ఇవేం ఉత్తర్వులంటూ విద్యాశాఖను నిలదీస్తున్నాయి. వివరాలోకి వెళ్తే రాష్ట్రంలోని సర్కారు బడుల్లో తనిఖీలకు పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులను విడుదల చేసింది. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు తనిఖీలు చేయాలంటూ కొత్త మార్గదర్శకాలను పొందుపర్చింది. ఈ ఉత్తర్వులు, మార్గదర్శకాలను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మార్పులు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై ఏకంగా ఓ ఉపాధ్యాయ సంఘం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే యోచనలో ఉన్నట్టు సమాచారం.
పాఠశాల విద్యాశాఖలో చాలాకాలంగా తనిఖీలు, ఇన్స్పెక్షన్ అన్న పదాలను వాడటమే లేదు. సపోర్టింగ్ – సూపర్ విజన్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. తనిఖీల పేరుతో అధికారులు ఉపాధ్యాయులను భయపెడుతన్నారన్న ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం మేరకు సపోర్టింగ్ సూపర్విజన్ అనే పదాలనే వినియోగంలోకి తీసుకొచ్చారు. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఇన్స్పెక్షన్ అన్న పదాన్ని వాడారు. కింది క్యాడర్ టీచర్లతో పైక్యాడర్ వాళ్లు పనిచేస్తున్న స్కూళ్లల్లో తనిఖీలు చేయడమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైస్థాయి అధికారి వస్తే మానిటరింగ్, ఇన్స్పెక్షన్ అనాలి కానీ, కింది స్థాయిలోని సెకండరీ గ్రేడ్ టీచరత్లో తనిఖీలు ఏమిటన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలే ఫౌండేషన్ లిటరసీ-న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అమలుకు మార్గదర్శకాలు ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్థాయి నుంచి జేడీలు, డీఈవోలు, ఎంఈవోల వరకు అన్నిస్థాయిల్లో పర్యవేక్షణ చేయాలని ఆయా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మళ్లీ కొత్తగా తనిఖీలు, మార్గదర్శకాలు ఏమిటో, ఉపాధ్యాయులతో తనిఖీలు ఏమిటో అర్థంకావడంలేదని టీచర్లు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో 523కు పైగా ఎంఈవో పోస్టుల్లో ఇన్చార్జులే ఉన్నారు. రెగ్యులర్ డిప్యూటీ ఈవోలు నలుగురే ఉన్నారు. డీఈవో పోస్టులు 10కి పైగా ఉండగా, కేవలం నలుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు పనిచేస్తున్నారు. పైగా రాష్ట్రంలో పర్యవేక్షణ అధికారుల పోస్టుల భర్తీ అటకెక్కింది. 2005 తర్వాత ప్రధానోపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించనేలేదు. దీంతో పర్యవేక్షణ గాడితప్పింది. కొత్త జిల్లాలు, మండలాల ప్రకారం ఎంఈవో, డీఈవో కొత్త పోస్టులను మంజూరు చేయలేదు. ఎంఈవో, డిప్యూటీ ఈవో, డీఈవో వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. విద్యాబోధనతో సంబంధంలేని బోధనేతర సిబ్బంది అయిన అసిస్టెంట్ డైరెక్టర్లకు డీఈవోలుగా అదనపు బాధ్యతలను అప్పగించారు. పోస్టుల భర్తీని పక్కనపెట్టి టీచర్ల వేలితో వారి కండ్లలోనే పొడుస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇది టీచర్ల మధ్య పంచాయితీకి దారితీస్తుందని అభిప్రాయపడుతున్నాయి.
పాఠశాలల పర్యవేక్షణ మార్గదర్శకాలను మార్చాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసొసియేషన్ (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) కోరింది. హెచ్ఎంలు పనిచేస్తున్న స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్లతో తనిఖీలు, పర్యవేక్షణ సమంజసం కాదని అసొసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజగంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ గిరిధర్‌గౌడ్, కోశాధికారి తుకారాం అభిప్రాయపడ్డారు. కింది స్థాయి క్యాడర్ ఉద్యోగులతో పర్యవేక్షణ చేయించడమంటే హెచ్ఎంలను అవమానించడమే అవుతుందని, ఈ మేరకు పాఠశాల డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు.
టీచర్లకు పర్యవేక్షణ తనిఖీ బాధ్యతలు అప్పగించడాన్ని డీటీఎఫ్ వ్యతిరేకించింది. దీనిని తిరోగమన చర్యగా అభివర్ణించింది. విద్యాశాఖ ఉత్తర్వులను నిలిపివేయాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమయ్య, లింగారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇది విద్యాసంక్షోభానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీచేయాలని కోరారు.
నిపుణులు, రిసోర్స్ పర్సన్లచే తనిఖీలు చేయిస్తే మంచిదని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు చెన్నయ్య సూచించారు. టీచర్లల్లోనే విషయ నిపుణులున్నారు, పాఠ్యపుస్తక రచయితలూ ఉన్నారు వారి సేవలను వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. తనిఖీలు భయపెట్టేలా ఉండొద్దు. ఘర్షణ వాతావరణాన్ని సృష్టించవద్దని కోరారు. తనిఖీల కోసం నియమించే వారి ఎంపిక విషయంలో అధికారులు జాగ్రత్త వహించాలని, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులను నియమించవద్దని, రాజకీయాలకు తావులేకుండా చూడాలని కోరారు.
ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు పాఠశాలల పర్యవేక్షణను అప్పగించడం ఆక్షేపణీయమని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్‌రెడ్డి, సదానందంగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం తిరోగమన చర్య అని అభివర్ణించారు. 629 మండలాలు 1,871 క్లస్టర్ల పరిధిలోని 24,146 స్కూళ్లను తనిఖీ చేసే బాధ్యతలను అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అప్పగిస్తే బోధన కుంటుపడే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తర్వులపై ప్రభుత్వం, ఉన్నతాధికారు లు పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులకు పాఠశాలల తనిఖీ బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, సునావత్ సురేశ్ స్పష్టంచేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో బోధనా ప్రమాణాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించడం శోచనీయమని పేర్కొన్నారు.