హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ జారీచేసింది. గ్రామాలు, వార్డులవారీగా ఫొటో ఓటర్లు లిస్టు ఉన్నదని తెలిపింది. సెప్టెంబర్ 2వ తేదీన ప్రచురితమైన గ్రామాలు, వార్డులవారీ ఫొటో ఓటరు జాబితా (https://finalgprolls.tsec.gov.in/gpwardwisevoterlistrural1.do)లో ఉన్నదని, అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే గురువారం వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు పేర్కొన్నది. శుక్రవారం (ఈ నెల 22న) అభ్యంతరాలను జిల్లా పంచాయతీ అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని పేర్కొన్నది. ఈ నెల 23న తుది ఓటరు జాబితాను గ్రామాలు, వార్డులవారీగా తిరిగి ప్రచురిస్తామని వెల్లడించింది. అదే రోజు ఫైనల్ ఓటరు జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అంటిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిపింది.