హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దాదాపు చేతులెత్తేసే పరిస్థి తి కనిపిస్తున్నది. దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా క్షేత్రం నుంచి జారుకుంటున్నారు. జాతీయస్థాయి నేతలు మొదలు గల్లీస్థాయి నాయకుల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. అమిత్షా ప్రచారానికి వస్తలేడు. అక్టోబర్ 31న వస్తానని చెప్పిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ముఖం చాటేసినట్టే. నడ్డా సభ ఉండబోదని రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ అధిష్ఠానం నుంచి వర్తమానం అందినట్టు తెలుస్తున్నది. ఇక నియోజకవర్గ బాధ్యతల్లో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర నేత లు కూడా ఎప్పుడు ఏ సాకు చూపి ప్రచారం నుంచి తప్పించుకోవాలా.. అని ఆలోచిస్తున్నారు. ఏదో ఒక వంకతో తమ షెడ్యూల్ను మార్చుకుంటున్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఈటల రాజేందర్ కూడా ప్రెస్మీట్ పెడ్తానంటూ శుక్రవారం హడావుడి చేశారు. మధ్యా హ్నం 2 గంటలకు ప్రెస్మీట్ ఉంటుందంటూ స్థానిక మీడియాకు సమాచారం ఇచ్చారు. తీరా మీడియా అక్కడికి చేరుకోగానే.. ‘నేను ఇప్పుడేమీ మాట్లాడ.. మళ్లీ కలుద్దాం’ అని వెళ్లిపోయారు. ఇక బీజేపీ నేతలు కూడా స్థానికం గా ఉండేందుకు ఇబ్బందిపడుతున్నారు. గెలిచే అవకాశాలు సన్నగిల్లుతుండటంతో ఎవరికివారు హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. తమకు బాధ్యతలు అప్పగించిన ప్రాంతంలో ఉన్నాం అంటే ఉన్నామన్నట్టుగా అనిపించుకొని వెళ్తున్నా రు. ఓడిపోయే సీటుకు పార్టీ అగ్రనేతలే దూరమవుతున్నపుడు మనం మాత్రం ఎందుకు ఎగేసుకుంటూ వెళ్లాలన్న భావన నేతల్లో కనిపిస్తున్నది.
షా టీమ్.. షాకింగ్ రిపోర్ట్
మునుగోడుపై షా తన సొంత టీమ్ ‘అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’ (ఏబీఎం)తో సర్వే చేయించి, ఆ కాపీని రాష్ట్ర పార్టీ వర్గాలకు పంపారు. దీంట్లో పార్టీ పరిస్థితి క్షేత్రస్థాయిలో బాగోలేదని రావడంతో నాయకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కేంద్ర నిఘా వర్గాలు కూడా మునుగోడులో మునుగుడేనని చెప్పినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఓడిపోయే సీటుకు తాను వెళ్లడం వృథా అని భావించిన అమిత్షా.. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను వెళ్లాలంటూ సూచించారని సమాచారం. తొలుత సభకు ఉద్యుక్తుడైన నడ్డా.. ఆ మేరకు రాష్ట్ర నేతలకు సమాచారం అందించారు. తీరా పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఆయనకూ అనుమానాలు మొదలయ్యాయి. ఫ్లాప్షోకు తానెందుకు వెళ్లాలని భావించిన నడ్డా.. ఉన్నపళంగా సభను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య కుమ్ములాట పెరిగింది. దీంతో ఎవరికివారు తూతూమంత్రంగానే పనిచేస్తున్నా రు. ఈ ఓటమిని ఎవరి ఖాతాలో వేద్దామా అని ఎవరికి వారు ఆలోచిస్తున్నారు. మరోవైపు రాజగోపాల్రెడ్డి ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచే ఛీత్కారాలే వస్తున్నాయి. నిరసనలే ఎదురవుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని తగ్గించుకున్న ఆయన.. జ్వరమో, ఒంట్లో బాగోలేదనో చెప్పి తప్పించుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నది.
ఎన్నికలు రద్దు చేయించే కుట్ర ?
మునుగోడులో ఓడిపోతున్నామని తెలియడంతో ఇప్పుడు ఉపఎన్నికనే రద్దు చేయించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీంట్లో భాగంగానే ఉన్నవీ లేనివీ కల్పించి సీఈసీకి కేంద్రమంత్రులు ప్రతిరోజూ వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈసీ ద్వారా మునుగోడులో ఎన్నిక జరగకుండా చూడాలని బీజేపీ ప్రణాళిక రచిస్తున్నది. తమిళనాడులోని ఆర్కే నగర్ ఎన్నికను రద్దు చేయించినట్టే.. మునుగోడులోనూ రద్దు చేయిస్తారని ప్రచారం జరుగుతున్నది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధా న్, రాజీవ్ చంద్రశేఖర్ ఈసీకి ఉన్నవీ లేనివీ ఫిర్యాదులు చేస్తూ ఒత్తిడి చేస్తున్నారు. హైకోర్టులో కేసులు వేయడం, ఓటర్ల నమోదు తప్పుగా ఉన్నదని చెప్పడం, డబ్బులు పంచుతున్నారని బురదజల్లడం వంటివి ఆ వ్యూహం లో భాగమేనని భావిస్తున్నారు. టీఆర్ఎస్పై ఫిర్యాదులు చేయడానికే ప్రత్యేక విభాగాన్ని బీజేపీ ఏర్పాటుచేయడం గమనార్హం.