GHMC | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో నాలా విస్తరణ, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణలో నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. గడిచిన కొన్ని నెలలుగా టీడీఆర్‌లు ఇవ్వడంలో కమిషనర్ ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా వాటర్‌బాడీలో ఉన్న టీడీఆర్ దరఖాస్తులు కమిషనర్ వరకు వెళ్లకుండా సంబందిత అధికారుల వద్దనే పెండింగ్‌లో పెట్టారు.
ఫలితంగా వందల కోట్ల విలువైన టీడీఆర్‌లు నిలిచిపోయి నిర్మాణరంగంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. కొత్తగా లేవు-ఉన్న వాటికి విపరీతమైన డిమాండ్అభివృద్ధి పనులకు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమిని సేకరించి, నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా ఈ టీడీఆర్‌ను ఇస్తున్నారు. నిర్వాసితుడు కోల్పోయిన దానికి నాలుగు రెట్లకు టీడీఆర్ పత్రాలను పరిహారంగా పొందుతాడు. ఉదాహరణకు ఆమీర్పేటలో 20 గజాల స్థలాన్ని కోల్పోయిన నిర్వాసితుడు జీహెచ్ఎంసీ ఇచ్చే 80 గజాల టీడీఆర్ పత్రాన్ని తీసుకుని ఇతరులకు విక్రయించుకునే హక్కు పొందుతాడు.
యాజమాని తన దగ్గరున్న టీడీఆర్‌ను ఎన్ని భాగాలుగానైనా అమ్ముకునే వీలు ఉంటుంది. టీడీఆర్ కొనుగోలు చేసిన వారు దానితో నిర్మాణ అనుమతి రుసుం చెల్లించవచ్చు. అదనపు అంతస్తులు, సెట్‌బ్యాక్ మినహాయింపులకూ టీడీఆర్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. దీంతో ఖరీదైన ప్రాంతాల్లో పరిమితికి మించి అదనపు అంతస్తులు నిర్మించాలనుకునే వారంతా టీడీఆర్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త టీడీఆర్‌లు రాకపోవడంతో మార్కెట్లో ఇప్పటికే ఉన్న టీడీఆర్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
కొన్ని నెలలుగా జీహెచ్ఎంసీకి కొత్త ప్రాజెక్టులు లేవని, హెచ్-సిటీ ప్రాజెక్టుల పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభ దశకు వచ్చాయని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన టీడీఆర్‌లను త్వరలో ఇవ్వనున్నామని అధికారులు తెలిపారు. కానీ వాటర్‌బాడీ, రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయిన బాధితులకు సైతం టీడీఆర్ సకాలంలో అందడం లేదు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయి టౌన్‌ప్లానింగ్ అధికారి మొదలు కమిషనర్ వరకు వందల సంఖ్యలో టీడీఆర్ దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేక నిలిచిపోవడం గమనార్హం. కమిషనర్ మాత్రం వచ్చే నెలలో టీడీఆర్‌లపై నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు పూర్తి కావాలంటే భూసేకరణ అత్యంత కీలకం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తుల సేకరణలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. 2017లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ‘టీడీఆర్’ పాలసీని తీసుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీఆర్‌ను ఆమలు చేశారు. దేశంలో మరే ఏ నగరంలో జరుగని విధంగా రికార్డు స్థాయిలో ఈ టీడీఆర్‌లను జీహెచ్ఎంసీ అందజేసింది. అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసే భూసేకరణకు నగదు మొత్తం ఇవ్వడానికి బదులుగా టీడీఆర్‌లు ఇచ్చే విధానాన్ని, టీడీఆర్ బ్యాంకును ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీని కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నీతి అయోగ్ కూడా ప్రశంసించింది. ఈ టీడీఆర్ విధానాన్ని ఇతర రాష్ర్టాలు కూడా అవలంబించాలని నీతి అయోగ్ సూచించింది. ఇంత విజయవంతమైన టీడీఆర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చింది.