DSC Sports Quota | హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ- 2024 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అధికార యంత్రాంగం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇప్పటికే రెండుసార్లు వెరిఫికేషన్ చేయగా మరోసారి కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయనున్నట్టు అభ్యర్థులకు సమాచారం అందించారు.
టీచర్ పోస్టుల భర్తీలో తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను అమలుచేశారు. ఈ కోటాలో 95 పోస్టులుండగా, దాదాపు 8వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత. స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాధ్యతను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు(శాట్స్) అప్పగించారు. 393 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. సవ్యంగా తేలిన 33 మందికి ఉద్యోగాలిచ్చారు. మిగిలిన అరవైకి పైగా పోస్టులను స్పోర్ట్స్ కోటాయేతర అభ్యర్థులతో ఓపెన్ కోటాకు మళ్లించి భర్తీచేశారు.
అయితే స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో తొలుత అక్టోబర్ మొదటి వారంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టగా, నవంబర్ 20, 21, 22 తేదీల్లో మరోసారి నిర్వహించారు. నవంబర్‌లో కింది స్థాయి అధికారులు (లో లెవల్ కమిటీ ) సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించారని, మరోసారి జనవరి 3, 4 తేదీల్లో హై లెవల్ కమిటీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తుందని తాజాగా 393 మంది అభ్యర్థులకు సమాచారమిచ్చారు. దీంతో స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి.