SC Reservations | హైదరాబాద్, ఫిబ్రవరి3 (నమస్తే తెలంగాణ): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు నివేదికను సోమవారం వెల్లడిస్తామంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. తీరా వెనక్కి తగ్గింది. క్యాబినెట్లో చర్చించిన అనంతరమే నివేదికను వెల్లడిస్తామంటూ మాటమార్చింది. సమగ్ర సర్వే వివరాల వెల్లడితో క్యాబినెట్ సబ్‌కమిటీపై సీఎం రేవంత్ అభ్యంతరాల నేపథ్యంలో దీనిపై ప్రభావం పడింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన సబ్‌కమిటీ సూచనల మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు అంశాలపై సిఫారసు చేసేందుకు ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏక సభ్య జ్యడీషియల్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఆ కమిటీ తన నివేదికను సోమవారం క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. ఉత్తమ్ నేతృత్వంలోని కమిటీ నివేదికలోని అంశాలపై చర్చించింది. క్యాబినెట్ సమావేశంలో చర్చించి, ఆపై అసెంబ్లీలో నివేదించనున్నట్టు తెలుస్తున్నది.
ఎస్సీ వర్గీకరణ నివేదిక వెల్లడిపై డైలమా నెలకొన్నట్టుగా తెలుస్తున్నది. ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా 15% రిజర్వేషన్ అమలవుతున్నది. అయితే, తమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాదిగలు పోరుబాట పట్టడంతో ఎట్టకేలకు ఈ అంశంపై 1995లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది. మాదిగల వాదన నిజమేనని సమర్థిస్తూ ఆ కమిషన్ 1996లో నివేదికను సమర్పించగా, దాని ఆధారంగా 1997 జూన్‌లో ఆనాటి టీడీపీ ప్రభుత్వం 15% ఎస్సీ కోటాను ఏ,బీ,సీ,డీగా విభజిస్తూ జీవోను విడుదల చేసింది.
వాస్తవంగా ఏ, బీ గ్రూపుల కులాలు తకువ లబ్ధి పొందాయని, సీ, డీ గ్రూపుల కులాలు తమ జనాభా శాతానికి మించి లబ్ధిని పొందాయని కూడా 1997లోనే గుర్తించారు. ఆ తర్వాత 2000లో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించగా, అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమలులోకి వచ్చింది. ఎస్సీలను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా వర్గీకరిస్తూ, వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు రిజర్వేషన్ కోటాను అమలుచేశారు. కానీ 2004లో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుకెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని తేల్చిచెప్పింది. నాటి నుంచి పెండింగ్‌లోనే ఉన్నది.
గత ఆగస్టులో సుప్రీంకోర్టుకు చెందిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్‌ను వర్గీకరించే అధికారం రాష్ర్టాలకు ఉన్నదని తేల్చిచెప్పింది. ఆ తీర్పును అధ్యయనం చేసి, తగు సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్కమిటీతోపాటు, హైకోర్టు విశ్రాంత జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. అయితే ఆ కమిషన్ నివేదికను అందజేసింది. వర్గీకరణ అమలుకు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలా? లేదంటే తాజా ఇంటింటి సర్వే గణాంకాలా? అనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతకు రాలేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో నివేదిక వెల్లడికి డైలమాలో పడ్డట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి3 (నమస్తే తెలంగాణ): ఇంటింటి సర్వే నివేదికను వెల్లడించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. క్యాబినెట్లో పెట్టకుండానే, చర్చించకుండానే నివేదికను ఎలా బయటకు విడుదల చేస్తారని క్యాబినెట్ సబ్ కమిటీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. గత నవంబర్‌లో చేపట్టిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల) నివేదికను ప్లానింగ్ శాఖ తాజాగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఆ నివేదికను క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్ ఉత్తమ్, కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి సచివాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ జనాభా వివరాలను ప్రకటించారు. అయితే ఆ వివరాల వెల్లడిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగహ్రం వ్యక్తంచేశారు. క్యాబినెట్లో చర్చించకుండానే ఎలా బయటపెడతారని సబ్‌కమిటీ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో ఓసీలు 6% లోపే ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ సర్వే ప్రకారం ఓసీలు 15 శాతానికి పైగా ఉన్నట్టు ప్రకటించారు. దీన్నిబట్టే ఈ సర్వే సమగ్రంగా లేదని అర్థమవుతోంది. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద డ్రామా ఆడుతున్నది. తాము అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, కానీ కేంద్రం ఈ రిజర్వేషన్లకు అంగీకరించలేదని ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నది.
-యూఎస్ ప్రకాశ్‌రావు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, అశ్వారావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వ కులగణన సర్వేలో బీసీల సంఖ్యలో తప్పుడు లెక్కలు చూపారు. ఇది బీసీలకు ముమ్మాటికీ అన్యాయమే. రానున్న కాలంలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుందన్న దురుద్దేశంతోనే ఇలా కులగణన గణాంకాల్లో తప్పుడు లెక్కలు చూపించింది. ఈ సర్వే లెక్కలతోనే బీసీలకు ఉన్న భ్రమలు కూడా తొలిగిపోయాయి. ఆరు నూరైనా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే.
– దిండిగాల రాజేందర్, బీసీ నాయకుడు
ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వే ఆమోదయోగ్యం కాదు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించడంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తా. 2015లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 51% ఉన్నదని, పదేండ్ల తర్వాత అది మరింత పెరగాల్సి ఉండగా, తగ్గడం ఏమిటి? బీసీ, మైనార్టీలతో కలుపుకొని 62%గా ఉన్న బీసీ జనాభాను రాష్ట్ర ప్రభుత్వం 56%గా చూపుతూ అన్యాయం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు.
– డాక్టర్ తిరునగరి శేషు, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్
కులగణన సర్వే పూర్తికాకుండానే కాంగ్రెస్ మంత్రులు లెక్కలు ప్రకటించారు. కాంగ్రెస్ చెప్పిన లెక్కలకు, సర్వేకు ప్రజల్లో విశ్వసనీయత లేదు. కేవలం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్ర ఇది. ప్రజాపాలన పేరిట ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఏ ఎన్నికల్లోనైనా ఓట్లతో బుద్ధి చెప్పడం ఖాయం.
-జూకంటి శ్రీశైలం, కురుమ సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి, జనగామ
కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు మైనార్టీలతో కలుపుకొని స్థానిక ఎన్నికల్లో 56.3% బీసీ రిజర్వేషన్లు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. బీసీ కుల గణన నివేదిక తప్పుల తడకగా ఉన్నది. కేసీఆర్ గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి ఒకే రోజులో కులగణనను పూర్తిచేశారు. ప్రస్తుతం మైనార్టీలు కాకుండా బీసీల జనాభాను తక్కువ చేసి కేవలం 46.25% మాత్రమే ఉన్నదని చెప్తున్నారు.
– అల్లం రవీందర్ పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
బీసీ కులగణన తప్పుడు నివేదికగా ఉన్నది. ఎన్నికల కోసమే దీనిని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది బీసీలు ఉన్నప్పటికీ వారు వివిధ ప్రాంతాలకు పనుల కోసం వెళ్లడంతో వారి పేర్లు నమోదు కాలేదు. అందుబాటులో ఉన్న వారి వివరాలు మాత్రమే నమోదు చేశారు. తాళం వేసి ఉన్న ఇండ్ల పక్కనున్న వారు చెప్పిన వివరాలను మాత్రమే సర్వేలో నమోదు చేశారు.
– బండి రమేశ్, బీసీ సంఘం మండల అధ్యక్షుడు, నర్సింహులపేట, మహబూబాబాద్ జిల్లా
50% కూడా పూర్తికాని సమగ్ర సర్వేను 80% పూర్తయినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం విడ్డూరం. ఎన్యూమరేటర్లు చాలా ఇండ్లను వదిలేయడం వల్ల సమగ్ర సర్వే ఎలా అవుతుంది? సేకరించిన డాటాలో కచ్చితత్వం లేదు. తక్షణమే 15 రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి 100% కులగణన చేయాలి. రీ సర్వే అనంతరమే నివేదికకు చట్టబద్ధత కల్పించి స్థానిక ఎన్నికల్లో బీసీలకు 56% రిజర్వేషన్లు కల్పించాలి.
– బత్తిని శివశంకర్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు