హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): 1950లో జారీచేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ఇందుకోసం బీఆర్ఎస్ తరఫున న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మేడె రాజీవ్సాగర్తో కూడిన బృందం ఢిల్లీలోని అంబేద్కర్ భవన్లో జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌తో భేటీ అయ్యింది. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు అక్కడ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బాలకృష్ణన్ కమిషన్‌ను కలిసి దళితుల బాధలు వివరించామని చెప్పారు.
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని కేసీఆర్ హయాంలో అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రంవద్ద పెండింగ్‌లో ఉన్నదని గుర్తుచేశా రు. ఎస్సీ హోదా లేకపోవడంతో వారికి విద్యాఉద్యోగాల్లో తీరని అన్యాయం జరుగుతున్నదని పేర్కొన్నారు. పురాతన విధానాలకు పార్లమెంట్లో మార్పులు చేయాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా దళిత క్రిస్టియన్ల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు. న్యాయపోరాటం చేస్తామని, పార్లమెంట్లో గళమెత్తుతామని పునరుద్ఘాటించారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది చొప్పున ఎంపీలున్నా కాంగ్రెస్, బీజేపీలు ఈ అంశాన్ని ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. వారికి బాధ్యతలేదా? అని నిలదీశారు.
బీసీలుగా గుర్తించడం అన్యాయం: కొప్పుల
వివిధ కారణాలతో క్రైస్తవమతం స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా తొలగించి వారిని బీసీ-సీలుగా గుర్తించడం ఎంతవరకు సమంజసమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్ర శ్నించారు. మతమార్పిడితో వారి ఆర్థిక, సా మాజిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులేమీ లేవ ని చెప్పారు. ఆర్టికల్ 341లో అడ్డంకిగా ఉన్న నిబంధనలను సవరించాల్సి బాధ్యత ప్రస్తుత కేంద్రప్రభుత్వంపై ఉన్నదని స్పష్టంచేశారు. కేసీఆర్ పాలనలో దళిత క్రిస్టియన్ల అభ్యున్నతికి విశేష కృషిచేశామని చెప్పారు.
బీఆర్ఎస్ తరఫున పోరాటం: రాజీవ్ సాగర్
రిజర్వేషన్ ఫలాలు కోల్పోతున్న దళిత క్రిస్టియన్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మేడె రాజీవ్‌సాగర్ పేర్కొన్నారు. వారి తరఫున చట్టపరమైన వేదికలతోపాటు ప్రజాక్షేత్రంలోనూ పోరాటం చేస్తామని ప్రకటించారు. కేంద్రం దిగివచ్చేదాకా ఉద్యమిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీలు దళితులకు తీరని ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. మతంమారితే రిజర్వేషన్లు తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రంలోని అధికార, ప్రతిపక్షాలు కండ్లు తెరిచి దళిత క్రిస్టియన్లకు న్యాయం చేయాలని, లేదంటే వారికి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
మతం మారితే వివక్ష ఆగదు: ఆర్ఎస్పీ
మతం మారినంత మాత్రాన దళితుల పట్ల వివక్ష మారదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. కారంచేడు, చుండూరు లాంటి ఘటనల్లో బాధితులందరూ మతంమారిన దళితులేనని గుర్తుచేశారు. అగ్రవర్ణాలు, బీసీలు, ఎస్టీలకు మతమార్పిడి స్వేచ్ఛ ఉన్నదని, వారు మతంమారినా రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కానీ మతంమారిన ఎస్సీలు పూర్వపు రిజర్వేషన్లు కోల్పోయేలా తీసుకొచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు అశాస్త్రీయం, రాజ్యాంగ వ్యతిరేకం, అమానవీయమని తప్పుబట్టారు. రాజ్యాంగంలోని అర్టికల్ 15, 18, 21, 25 దేశంలోని పౌరులందరికీ మతపరమైన స్వేచ్ఛను ఇచ్చాయని గుర్తుచేశారు. కానీ దళితులకు మతపరమైన ఆంక్షలు విధించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్లు, హిందూ, ముస్లింలు ఇలా అన్నివర్గాలను సమానంగా చూశారని, రాజ్యాంగ పీఠికలోని లౌకికత్వాన్ని తు చ తప్పకుండా అనుసరించారని కొనియాడారు.