హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈ నెల 25న వికారాబాద్ జిల్లా లగచర్లలో పర్యటించనున్నది. లగచర్ల ఘటనపై క్షేత్రస్థాయిలో విచారించనున్నది. ఈ మేరకు కమిషన్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, డీజీపీకి కమిషన్ కార్యాలయం గురువారం ఆదేశాలను జారీచేసింది.
ఉదయం లగచర్ల గ్రామానికి వెళ్లి బాధితులతో మాట్లాడనున్నది. అనంతరం సంగారెడ్డి జిల్లా జైలులో ఉన్న రైతులను కలిసి వివరాలను తెలుసుకోనున్నది. ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ అంశం వివాదాస్పదంగా మారడం, గిరిజనులపై ఇష్టారీతిన పోలీసులు దాష్టీకానికి పాల్పడటం తెలిసిందే. ఈ ఘటనపై రైతులను అరెస్టు చేసి సంగారెడ్డి జైలులో రిమాండ్లో ఉంచారు.