హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ అనుసరిస్తున్న నాన్చివేత వైఖరిపై సుప్రీంకోర్టు సోమవారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ధిక్కరణ నోటీసు జారీచేసింది. బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారంటూ మహేశ్వర్‌రెడ్డి తన పిటిషన్లో ఆరోపించారు. పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరారని, వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని, సుప్రీంకోర్టు ఆదేశించినా స్పీకర్ పాటించడంలేదని మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను స్పీకరించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ స్పీకర్‌పై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌కు జతచేస్తున్నట్టు తెలిపింది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించిన పిటిషన్లు అన్నింటిపై ఫిబ్రవరి ఆరో తేదీన విచారణ జరుపుతామని పేర్కొన్నది. బీఆర్ఎస్కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ న్యాయపోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు వేసింది. ఇటీవల సుప్రీంకోర్టు స్పీకర్ మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పింది. సుప్రీంకోర్టు విధించిన గడవులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. దీన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత సుప్రీంకోర్టులో స్పీకర్ మీద ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.