SC Gurukula | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో టీచర్ల బదిలీలలో నెలకొన్న గందరగోళం కొలిక్కిరావడం లేదు. అసలు సొసైటీలో ఏం జరుగుతున్నదో తెలియడం లేదని టీచర్ల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. 317 జీవోకు సంబంధించిన బదిలీల్లో సీనియర్లకు కాదని జూనియర్లకు ప్రాధాన్యమిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అధికారుల సూచన మేరకు సోమవారం సొసైటీ కార్యాలయానికి బదిలీల విజ్ఞాపనలతో టీచర్లు పెద్దఎత్తున తరలివచ్చారు. చంటిబిడ్డలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం ముందు నిరీక్షించినా సెక్రటరీ ఎవరితోనూ సమావేశం కాలేదు. ఎవరి నుంచీ వినతులను స్వీకరించవద్దని ఉద్యోగులకు స్వయంగా కార్యదర్శే ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.