Agriculture College | హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా కోరుట్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీకి చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీని (Agriculture College) మూసివేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఉన్నతాధికారుల తీరు ఈ అనుమానాలను మరింత పెంచుతున్నది. కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకపోవడం, మిగిలిన సీట్లను భర్తీ చేయకపోవడం అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో కోరుట్లలో బీఎస్సీ అగ్రికల్చర్ బాలికల కాలేజీని ఏర్పాటుచేసి 2023-24 నుంచి అడ్మిషన్లు ప్రారంభించారు.
తొలి ఏడాది 50సీట్లను భర్తీచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గతేడాది కాలేజీలో 50 సీట్లకుగాను కేవలం 34సీట్లను మాత్రమే భర్తీ చేశారు. మిగిలిన సీట్ల కోసం అనేక మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ సొసైటీ ఉన్నతాధికారులు మాత్రం సీట్లను భర్తీ చేయలేదు. ఇక ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. ఇదిలా ఉండగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీ పరిధిలోని పలు గురుకుల కాలేజీలను రద్దు చేయడంతోపాటు మరికొన్ని కాలేజీలను విలీనం చేసింది. డిగ్రీ కాలేజీల కుదింపునకు చర్యలు చేపట్టడం గమనార్హం.
29 వరకు బీసీ గురుకుల కాలేజీల్లో దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని అగ్రికల్చర్ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సైదులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశం పొందే విద్యార్థులు 29లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.