ముందు తెలంగాణ వాటా.. పెండింగ్ సమస్యలు తేల్చండి
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్
ఖైరతాబాద్, జూన్ 30 : తెలంగాణ రాష్ట్రంలో అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించకుండా, రాష్ర్టానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ప్రధాని మోదీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రశ్నించారు. బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభను మాదిగ జాతి మొత్తం బహిష్కరిస్తుందని ఆయన ప్రకటించారు. ఈనెల 10న ఓయూలో జరుగనున్న మాదిగల అలయ్ బలయ్ కరపత్రాలను గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాదిగ సంఘాలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ, వర్గీకరణతో పాటు మాదిగలకు 12 శాతం రిజర్వేషన్, ముస్లిం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడకుండా ప్రధాని మోదీ ఇక్కడ సభ పెట్టడం అర్థరహితమని అన్నారు.
బీజేపీ హిందూ, ముస్లింల మధ్య విభేదాలను సృష్టించి దేశాన్ని హింసాత్మకమైన ప్రదేశంగా మారుస్తున్నద్నారు. బీఎస్ఎన్ఎల్, రైల్వేలాంటి ప్రభుత్వ ఆస్తులను అమ్మివేశారని, ఇప్పుడు సైన్యాన్ని కూడా అమ్మేయాలని చూస్తున్నారని, నిరుద్యోగ యువత ఉద్యోగాలు అడుగుతుంటే వారిని జైళ్లలో పెడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ, తెలంగాణ మాదిగ మహాసభ అధ్యక్షులు గజ్జెల మల్లికార్జున్, తెలంగాణ దళిత దండు రాష్ట్ర అధ్యక్షులు మొగులయ్య, మహాఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ముత్యపాగ నర్సింగరావు, మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు గడ్డ యాదయ్య, నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బూదాల బాబూరావు, మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.