హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ‘దళితులను కూలిపనులు చేయడం కోసమే పరిమితం చేయొద్దు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పించండి’ అని నాడు బ్రిటిష్ పాలకులను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డిమాండ్ చేశారు. ఏడు దశాబ్దాలు దాటినా ఆనాటి అంబేద్కర్ ఆశయం స్వతంత్ర దేశంలో అమలుకు నోచలేదు. ఇన్నేండ్ల తర్వాత నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసి చూపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టుల్లో, వైన్‌షాపుల్లో, దవాఖానల్లో డైట్, సెక్యూరిటీ ఏజెన్సీల్లో దళితులకు రిజ్వేషన్ సౌకర్యం కల్పించారు. ఫలితంగా ఒకప్పుడు రోజువారీ వర్కర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు కాంట్రాక్టర్లుగా మారారు. నలుగురికి పని ఇస్తున్నారు. ఒకప్పుడు వైన్ షాపుల్లో కౌంటర్‌కు అవతల ఉన్నవారు.. ఇప్పుడు కౌంటర్‌కు ఇటు గల్లాపెట్టె దగ్గర కూర్చుంటున్నారు. డైట్ కాంట్రాక్టర్లుగా మారి నలుగురికి భోజనం పెడుతున్నారు. తలెత్తుకొని సగర్వంగా జీవిస్తూ, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారు. ఫలితంగా అంబేద్కర్ కన్న కల నేడు తెలంగాణలో సాకారం అవుతున్నది. దళితులకు డబ్బులు పంచడమే పరిషారం కాదు. సామాజిక అసృ్పశ్యతను తొలగించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. అందుకే ఈ రిజర్వేషన్ల ద్వారా వారు వ్యాపారం చేసి మంచి ఆదాయాన్ని, సమాజంలో గౌరవాన్ని పొందేలా చేయగలిగారు.
56 దవాఖానల్లో ఎస్సీలే కాంట్రాక్టర్లు
ప్రభుత్వ దవాఖానల్లో పారిశుధ్యం, రక్షణ (ఐహెచ్ఎఫ్ఎంఎస్), పోషకాహార (డైట్) ఏజెన్సీల్లో 16 శాతం దళితులకు కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిరుడు మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండరు నిబంధనల్లో పలు సడలింపులు ఇచ్చారు. టర్నోవర్‌లో 50 శాతం తగ్గించారు. ఒక టెండర్ వచ్చినా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దవాఖానలను రెండు విభాగాలుగా విభజించారు. ఈ మేరకు నిరుడు మార్చి 29న డ్రా ద్వారా దవాఖానలను ఎంపిక చేశారు. రాష్ట్రంలో 100లోపు పడకలున్న దవాఖానలు 122, వంద నుంచి 500 పడకలున్న దవాఖానలు 53 ఉన్నాయి. వీటిల్లో 28 దవాఖానల ఐహెచ్ఎఫ్ఎంఎస్, 28 దవాఖానల డైట్ ఏజెన్సీలను దళితుల కోసం కేటాయించారు. ఇలా మొత్తం 56 మంది ఎస్సీలు ప్రభుత్వ దవాఖానల ఏజెన్సీలు పొంది కాంట్రాక్టర్లుగా మారారు.
గల్లాపెట్టె లెక్క పెడుతున్నరు
ఒకప్పుడు వైన్స్ అంటేనే పెద్దోళ్ల వ్యవహారం.. డబ్బున్నోళ్ల వ్యాపారం. ధైర్యం చేసి డబ్బు కట్టి లైసెన్స్‌కు పోటీ పడదామని అనుకున్నా వస్తుందో రాదో అనే అయోమయం. కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు వృథా అవుతుందనే భయం. ఇలాంటి పరిస్థితుల మధ్య దళితులు వైన్ షాపుల కౌంటర్లకు అవతలే ఉండేవారు. కానీ సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం యోచించారు. ‘దళితులు గల్లాపెట్టె మీద కూడా కూర్చోవాలి’ అని ఆలోచించారు. 2021 నవంబర్‌లో వైన్ షాపుల్లో గౌడ కులస్థులు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. ఎస్సీలకు 10 శాతం కేటాయించారు. 2021 డిసెంబర్ నుంచి 2023 నవంబర్ వరకు వైన్‌షాపుల టెండర్లలో దళిత రిజర్వేషన్ అమలయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్ షాపులు ఉండగా, ఇందులో 262 షాప్‌లు దళితులకు రిజర్వ్ అయ్యాయి. అప్పటి నుంచి ఆయా షాపుల్లో కౌంటర్‌పై దళితులు కూర్చుంటున్నారు. సేట్లుగా మారారు. గల్లాపెట్టెను లెక్కపెట్టుకుంటున్నారు.
నాటి వర్కర్లే కాంట్రాక్టర్లు
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళితుల గోడును మానవతా దృక్పథంతో ఆలోచించి 2018లో జీవో 59 విడుదల చేశారు. జనాభా ప్రకారం సివిల్ వర్క్స్‌లో ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 6 శాతం, వడ్డెర సగర కులస్థులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించారు. పైగా గరిష్ఠ పరిమితిని రూ.కోటికి పెంచారు. దీంతో ఒకనాడు కూలీలుగా, ప్లంబర్లుగా, సూపర్వైజర్లుగా, మేస్త్రీలుగా పనిచేసిన వారు నేడు సొంతంగా ప్రభుత్వ కాంట్రాక్టులు చేయడం ప్రారంభించారు. ఇలా ఈ రిజర్వేషన్ ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,000 మంది ఎస్సీలు కాంట్రాక్టర్లుగా మారినట్టు అంచనా. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 250 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. ఈ రిజర్వేషన్ ఫలితంగా ఎస్సీల ఆలోచనా విధానంలోనూ మార్పు వచ్చింది.
డైట్ ఏజెన్సీలు కేటాయించిన దవాఖానలు
100 పడకలలోపు దవాఖానలు అంబర్‌పేట (హైదరాబాద్), డబీర్‌పురా (హైదరాబాద్), బూర్గంపాడు, పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం), గూడూరు (మహబూబాబాద్), బెల్లంపల్లి (మంచిర్యాల), ఏటూరునాగారం (ములుగు), ఉప్పునూతల (నాగర్‌కర్నూలు), నకిరేకల్ (నల్లగొండ), మక్తల్ (నారాయణపేట్), ముథోల్ (నిర్మల్), డిచ్పల్లి (నిజామాబాద్), మహేశ్వరం (రంగారెడ్డి), మీర్జాపూర్ (సంగారెడ్డి), మర్పల్లి (వికారాబాద్), ఖిలాగణపూర్ (వనపర్తి), వర్ధన్నపేట (వరంగల్), ఘట్కేసర్ (మేడ్చల్ మల్కాజిగిరి), కల్వకుర్తి (నాగర్‌కర్నూల్), ధర్మపురి (ఎంసీహెచ్ – జగిత్యాల)
100-500 పడకల దవాఖానలు
భూపాలపల్లి (ఏరియా హాస్పిటల్ -జయశంకర్ భూపాలపల్లి), లక్షెట్టిపేట్ (ఏహెచ్-మంచిర్యాల), వనస్థలిపురం (ఏహెచ్-రంగారెడ్డి), భద్రాచలం (ఏహెచ్-భద్రాద్రి కొత్తగూడెం), ప్రభుత్వ సీడీ, టీబీ హాస్పిటల్ (వరంగల్), జనరల్ హాస్పిటల్ (సిద్దిపేట), జనరల్ హాస్పిటల్ (మహబూబ్‌నగర్), జిల్లా దవాఖాన (కరీంనగర్),
ఐహెచ్ఎఫ్ఎంఎస్ ఏజెన్సీల కేటాయింపులు 100 పడకలలోపు దవాఖానలు
కాగజ్‌నగర్ (కుమ్రంభీం ఆసిఫాబాద్), అశ్వారావుపేట, ఎల్లనూరు (భద్రాద్రి కొత్తగూడెం), బచ్చన్నపేట (జనగాం), దోమకొండ (కామారెడ్డి), బాలానగర్ (మహబూబ్‌నగర్), బెల్లంపల్లి (మంచిర్యాల), రామాయంపేట (మెదక్), ఏటూరు నాగారం (ములుగు), సుల్తానాబాద్ (పెద్దపల్లి), యాచారం (రంగారెడ్డి), మనూర్ (సంగారెడ్డి), తుంగతుర్తి (సూర్యాపేట), పరకాల, కమలాపూర్ (హనుమకొండ), ఆలేరు (యాదాద్రి భువనగిరి), చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి), మంథని (పెద్దపల్లి), సీతాఫల్మండి (యూసీహెచ్సీహైదరాబాద్), ఉట్నూరు (జిల్లా దవాఖాన – ఆదిలాబాద్),
100-500 పడకల దవాఖానలు
బాన్సువాడ (ఏరియాహాస్పిటల్ -కామారెడ్డి), మిర్యాలగూడ (ఏహెచ్, నల్లగొండ), ఆర్మూర్ (ఏహెచ్-నిజామాబాద్), వేములవాడ (ఏహెచ్) -రాజన్న సిరిసిల్ల, వనస్థలిపురం (ఏహెచ్-రంగారెడ్డి), వికారాబాద్ (ఏహెచ్), దుబ్బాక (సీహెచ్‌సీ- సిద్దిపేట), కింగ్ కోఠి (జిల్లా దవాఖాన – హైదరాబాద్)
సామాజిక గౌరవం పెరిగింది
రెండేండ్ల కిందటివరకు నేను చిన్నపాటి పనులు చేసుకునేవాడిని. ఎస్సీలకు 10 శాతం వైన్‌షాపుల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాత నేను నా స్నేహితులు అరుణ్, దీపక్, నర్సింగ్‌రావు, ప్రసాద్ కలిసి టెండర్లలో పాల్గొన్నాం. మాకు యాదాద్రి జిల్లా కొండమడుగులోని వైన్‌షాప్ దక్కింది. ఒకప్పుడు మేము కౌంటర్‌కు అటువైపు ఉండేది. ఇప్పుడు కౌంటర్‌కు ఇటువైపు వచ్చినం. వైన్‌షాప్ ఓనర్ అంటూ పిలుస్తుండటంతో సామాజికంగా గౌరవం పెరిగింది.
– నల్ల బాబు, వైన్ షాప్ ఓనర్
రిజర్వేషన్ వల్లే కాంట్రాక్టర్‌ను అయ్యా
మంత్రి హరీశ్‌రావు తీసిన డ్రాలో మా లక్సెట్టిపేట దవాఖాన ఎస్సీలకు వచ్చింది. దీంతో టెండర్ వేస్తే నాకే కాంట్రాక్ట్ వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ఇద్దరు వంట మనుషులు, ఇద్దరు బాయ్స్ పనిచేస్తున్నారు. నలుగురికి ఉపాధి చూపడంతో పాటు నలుగురికి భోజనం పెడుతున్నానన్న సంతృప్తి ఉంది. రిజర్వేషన్ వల్లే నేను ఒక కాంట్రాక్టర్‌గా మారాను.
– బీ మల్లయ్య, లక్సెట్టిపేట్, జగిత్యాల జిల్లా (డైట్ కాంట్రాక్టర్)
మా పిల్లల బతుకులు మారుతున్నయ్
రూ.లక్ష పని నుంచి రూ.కోటి వరకు స్థోమతకు తగ్గట్టుగా పనులు చేసుకుంటున్నాం. ఇప్పుడు జీహెచ్ఎంసీలో వచ్చే టెండర్లలో దాదాపు 30 శాతం ఎస్సీలవే ఉంటున్నాయి. దీంతో మా పిల్లలకు మంచి చదువు చెప్పించగలుగుతున్నాం. ఇంకో పదేండ్ల తర్వాత వీటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఎస్సీ బిడ్డలు ఓపెన్ క్యాటగిరీలో పోటీపడి అందుకునే రోజులూ వస్తాయి.
– పీ వెంకటేశ్, సివిల్ కాంట్రాక్టర్, హైదరాబాద్
ఆర్థిక సమానత్వం రానంత వరకు.. సామాజిక సమానత్వం సాధ్యం కాదు.
– డాక్టర్ బీఆర్ అంబేద్కర్
ఐహెచ్ఎఫ్ఎంఎస్, డైట్ ఏజెన్సీల కేటాయింపు ఇలా..