హుజూర్నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో (Huzur Nagar) భారీ ఏటీఎం చోరీ జరిగింది. పట్టణంలోని లింగగిరి రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు రూ.20 లక్షలు దోచుకెళ్లారు. ఆదివారం ( జూన్ 1) తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఫార్చునర్ కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంను గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేశారు. అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. అనంతరం ఏటీఎంకు నిప్పు పెట్టి వెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
బ్యాంకర్లను ముందే హెచ్చరించిన సీఐ..
హుజూర్నగర్ పట్టణంలో ఎస్బీఐకి సంబంధించిన 4 ఏటీఎంలు ఉన్నాయని, ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు రాత్రి వేళలో మూసివేయడం గాని సెక్యూరిటీ గార్డునైనా నియమించాలని హుజూర్నగర్ సీఐ చరమందరాజు గతంలో హెచ్చరించారు. సీఐ ఆదేశాలతో ఎస్ఐ ముత్తయ్య గత నెల 27న అంటే నాలుగు రోజుల క్రితమే ఏటీఎంలు నిర్వహించే అన్ని బ్యాంకులకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించి ముందస్తుగా హెచ్చరించి ఆదేశాలు ఇచ్చారు. అయినా బ్యాంకు సంబంధించిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తున్నది.