కురవి, డిసెంబర్ 9 : ఆర్భాటం తప్ప ఆలోచన లేని ప్రభుత్వ తీరుకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకమే నిదర్శనమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. సమీకృత గురుకుల భవన సముదాయ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం శిలాఫలకంపై పూలు చల్లి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
గత సంవత్సరం 8-12-2024న శంకుస్థాపన చేసి నేటికీ తట్టెడు మట్టి పోయలేదని, కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, దివాలాకోరుపాలన అని దుయ్యబట్టారు. రెండు సంవత్సరాల్లో డోర్నకల్ నియోజకవర్గానికి రెండు రూపాయలు కూడా తీసుకు రాలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల కోసం చుట్టపుచూపుగా వస్తున్న ఎమ్మెల్యే రామచంద్రూనాయక్ శిలాఫలకం కనిపిస్తలేదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్న అంచనాలు గాల్లో కలిసిపోయాయని, పారిశ్రామిక వేత్తలు ఎవరూ రాకున్నా స్టేజీ మాత్రం కాంగ్రెస్ నేతలతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో కేటీఆర్ నాయకత్వంలో ప్రపంచంలో పేరుపొందిన కంపెనీలు హైదరాబాద్‌కు తీసుకొచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులకు లబ్ధి చేకూర్చడానికే గ్లోబల్ సమ్మిట్‌ను ఏర్పాటు చేశారని ఆరోపించారు.