కురవి, సెప్టెంబర్ 06 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మనసు మారాలని, సబ్బండ వర్గాలకు అన్యాయం చేయకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాలని బొడ్రాయి వద్ద పూజలు చేసి దేవుడి కోరుకున్నానని మాజీ మంత్రి సత్యరాథోడ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కురవి మండలం పెద్దతండాలో ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆటో డ్రైవర్ల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వారికి మద్దతుగా ఆటో నడిపి నిరసనలో పాల్గొన్నారు. మహబూబాద్ జిల్లా కురవి మండలంలోని పెద్దతండా గ్రామంలోని బొడ్రాయి వద్ద సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు అమలు చేయకపోవడం సరికాదని విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలులో ఇప్పటికే 1000 రోజులు గడిచాయని, ఇక మిగిలింది 800 రోజులు మాత్రమేనని సత్యవతి రాథోడ్ అన్నారు. మిగిలిన సమయంలోనైనా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, బోడ శ్రీనివాస్, రాందాస్, సిరి నాయక్, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.