నిత్యం తొండిమాటలు చెబుతూ రైతులను మోసం చేస్తున్న బీజేపీ నేతలను ఊర్లోకి రానివ్వొద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి ఒకరు..ఆదివాసీలకే రిజర్వేషన్లు ఉంటాయని చెప్పి మరొకరు అబద్ధాలతో ఎంపీలయ్యారని, అవే అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహబూబాబాద్ జిల్లాలోని దాట్ల గ్రామ సర్పంచ్ కొమ్మినేని రవీందర్రావు తండ్రి కొమ్మినేని పెద్ద అంతయ్యపటేల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి మంత్రి సత్యవతిరాథోడ్ శుక్రవారం హాజరయ్యారు. అంతయ్యపటేల్ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.
అమాసకు, పున్నానికి గ్రామాలకు వచ్చే రాజకీయపార్టీల నేతలకు ప్రజలే తగిన బుద్ధిచెప్పాలని మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు.ఈ ప్రాంత అవసరాలు తెలిసి, అభివృద్ధి చేసే సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని ఆమె కోరారు. మిగతా రాష్ట్రాల్లో వడ్లు, ధాన్యం కొంటున్న కేంద్రం..తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలో ధర్నా చేసినా కేంద్రంనుంచి ఉలుకూ పలుకూ లేదని మండిపడ్డారు.
బీజేపీ సర్కారుకు రైతులపై ఏమాత్రం ప్రేమలేదన్నారు. ఈ రాష్ట్ర రైతన్న బాధపడొద్దనే ఉద్దేశంతో రైతు పండించిన పంటనంతా కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, రైతుబిడ్డగా ఆయనకు అన్నదాతల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఆమెతోపాటు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీటీసీ బండి వెంటక్రెడ్డి, తదితరులున్నారు.